చంద్రబాబుకు ఆ అర్హత లేదు
రాజమండ్రి నవంబర్ 27
ఈ దేశంలో ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడటం దారుణమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే ఆర్హత లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారని అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాజ్యంగం బద్దంగానే అమలు చేస్తున్నారని, ఇంగ్లీష్ మీడియంలో తీసుకువస్తున్న సంస్కరణలను చూసి తట్టుకోలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.చంద్రబాబు బురదజల్లే తీరుతో రాజాకీయాలు చేస్తూ దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారని, తాను చేయాల్సిన పని చేసి ఎదుటివారిపై బురదజల్లే అలవాటు చంద్రబాబుది అని ఆయన విమర్శించారు. అలాగే సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్నారని, మీ నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు మీ అక్రమాలు తెలుసుకునే ప్రజలు మీకు 23 స్థానాలిచ్చారని, గారడీ విద్యలు చేయొద్దని చంద్రబాబుకు మంత్రి హితవు పలికారు. సకాలంలో నిర్మాణాలు చేపట్టని సంస్థలకిచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నామని, దీంతో చంద్రబాబుకు సంబంధించిన కంపెనీలు తెగ బాధపడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే తండ్రి కొడుకులు ఏది పడితే అది మాట్లాడటం దారుణమని, రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్ అని విమర్శించారు. ఇంకా టీడీపీ బ్రతికే ఉందనే భ్రమను తండ్రికొడుకులు కల్పిస్తున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు.