మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్‌కు చిదంబరం కీలక సూచన
ముంబై నవంబర్ 27
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో దాదాపు 100 రోజుల నుంచి తిహార్ జైలులో గడుపుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మహారాష్ట్రలో కొలువుతీరనున్న సంకీర్ణ సర్కార్‌కు కీలక సూచన చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కార్ ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టాలని కోరారు. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రైతు సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా శిశుసంక్షేమం వంటి ప్రజా ప్రయోజనాలపై మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు జైలులో తనను కలిసిన కొద్దిసేపటి తర్వాత చిదంబరం ఈ మేరకు ట్వీట్ చేశారు.గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మనీష్ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.