రైతు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు: అల్లోల
నిర్మల్ నవంబర్ 27
రైతులు బాగుపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం అమలు చేస్తున్నారన్నారు. రైతు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన ఎరువులు సకాలంలో అందిస్తున్నమని తెలిపారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించి రైతులకు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందన్నారు. మార్చి 31లోగా వరి పంటలు కోసే విధంగా రైతులు సకాలంలో తూకం, వరి నార్లు వేసుకోవాలని సూచించారు.