నీల ‘కం’ధరుడు
దేవ దానవులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని చిలుకుతూండగా అంతకంటే ముందు ‘హాలాహలం’ అనబడే విషము ఉద్భవించింది. భుగభుగ పొగలతో, భయంకర విస్ఫోటనలతో ఆ దావానలం నుండి ఆవిర్భవించిన జ్వాలలకి లోకాలు అట్టుడికి పోయి, ఊపిరాడక తల్లడిల్లాయి.
ఆ సమయాన దేవతలు బ్రహ్మతో సహా కైలాసానికి పరువెత్తి వెళ్ళి ఈశ్వరుడిని ప్రార్థించారు.
‘‘మహేశ్వరా! పరమేశ్వరా! ఓంకార స్వరూపా! నీవు తప్ప మమ్మల్ని కాపాడగలిగే వారెవరూ లేరు ప్రభూ! ఆ విష జ్వాలలని నీలో కలుపుకుని మాతో సహా సమస్త ప్రాణకోటికీ ప్రాణభిక్ష పెట్టి అనుగ్రహిం చు. మూడో కంటి మంటలతో మన్మథుణ్ణి భస్మం చేసిన నిన్ను ఈ హాలాహలం ఏమి చేయగలదు?! రక్షించు తండ్రీ! పాహిపాహి! రక్షరక్ష!’’ అని వేడుకోగా పరమేశ్వరుడు వాళ్ళ దీనాలాపాలకి కరిగిపోయాడు. పార్వతి తో ‘‘దేవీ! లోకమంతా భయవిహల్వమై ఉన్నది. వెంటనే ఈ హాలాహలాన్ని అదుపు చేయాలి. ఈ హాలాహలాన్ని నేను తీయని పళ్ళ రసం లాగా పానం చేసి జగాలను రక్షిస్తాను చూడు!’’ అని నేరేడు పండు రంగులో ఉండి పొగలు కక్కుతున్న ఆ విషాన్ని చిన్న ముద్దలాగా చేసాడు. తరువాత సమస్త లోకాలకీ స్థానమైన తన ఉదరంలోనికి ఏ కాస్త కూడా పోని విధంగా, ఎంతో జాగ్రత్తగా, ఆఖరికి తన కంఠాభరణాలైన సర్పాలకు సైతం హాని కలుగనీయక, అతి లాఘవంగా ఆ ముద్దని మ్రింగి తన కంఠభాగాన నిలుపుకుని ‘నీల‘కం’ధరుడు’ లేక ‘నీల కంఠుడు’ అయ్యాడు ఆ పరమేశ్వరుడు. గరళ సేవనం వలన ఆయన కంఠ ప్రదేశాన ఒక నీలి మచ్చ ఏర్పడి, అది కూడాఆ ధవళ వర్ణుడికి ఒక అలంకారమై భాసిల్లింది. పార్వతీదేవి ‘సర్వ మంగళ మాంగళ్య’గా అప్పట్నుండీ ప్రసిద్ధి గాంచింది. శివుడు చేసిన ఈ ‘హాలాహల భక్షణం’ అనే ఘట్టాన్ని విన్నవారూ, వ్రాసినవారూ, చదివిన వారూ అందరూ విష జంతువుల వలనా, అగ్ని వలనా ఏ మాత్రం కష్టమూ పొందరు. ఈ ఉదంతాన్ని పరీక్షిత్తుకి భాగవత పురాణం వినిపించినప్పుడు శుక మహర్షి తెలిపారు.
శివరాతి వ్రత మహాత్మ్య గాథలు
సూత మహర్షి శౌనకాదులకీ విధంగా వివరించసాగారు. ‘‘శౌనకాది మునులారా! శివరాత్రి వ్రత మహాత్మ్యము చెప్పనలవి కాని నవ నిధి నాయకుడైన కుబేరుడి గత జన్మ గాథలు ఈ విషయాన్ని తెలుపుతాయి. చెబుతాను. వినండి.’’
గుణనిధి / కుబేరుడి కథ
పూర్వం కాంపిల్య నగరాన నివసిస్తూ ఉండిన యజ్ఞదత్త, సోమిదమ్మ దంపతులకి లేకలేక ‘గుణనిధి’ అనే పుత్రుడు కలిగాడు. కానీ అతనికి ఏ ఒక్క సద్గుణమూ లేదు. పైపెచ్చు తల్లి గారాబం వలన మరింత చెడిపోయి, చివరికి జూదరిగా, వేశ్యలోలుడుగా మారి, వాటికోసం ఇంటిలోని నగలు సైతం దొంగిలించే స్థితికి వచ్చాడు. తల్లి ఎంత బ్రతిమాలినా అతడి ప్రవర్తనను మార్చలేక, భర్తకి విషయం చెప్పలేక అతడి చెడు అలవాట్ల సంగతి ఆయన దగ్గర దాచిపెట్టింది.
కానీ విధివశాత్తూ ఒకనాడు జూదరి ఒవిబడు గుణనిధి జూదంలో ఓడిపోయి ఫలితంగా గుణనిధి అతనికి చెల్లించుకున్న రాజముద్రిక గల తన వజ్రపు టుంగరం ధరించి యజ్ఞదత్తుడి కంటబడ్డాడు. అతని ద్వారా తండ్రికి తన కుమారుడి గుట్టు బయల్వడింది. ఆ సంగతి తెలుసుకున్న గుణనిధి భయపడి అప్పటికప్పుడే ఊరు విడిచి పారిపోయి మరోగ్రామం చేరి అక్కడున్న శివాలయంలోకి ప్రవేశించాడు.
ఆనాడు మహా శివరాత్రి పర్వదినం. భక్తులందరూ శివపూజలూ, నామ సంకీర్తనమూ చేసి రాత్రి నాలుగవ ఝాము శివుడికి పునః పూజ చేసి నైవేద్యంగా భక్ష్య భోజ్యపా నీయాలు సమర్పించి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఆకలితో ఉన్న గుణనిధి మెల్లగా గర్భగుడికి చేరుకుని, దీపాలు కొండెక్కి చీకటిగా ఉండటంతో తన వస్త్రాన్ని అక్కడున్న నూనెలో ముంచి దీపం వెలిగించాడు. నైవేద్య పాత్రను తీసుకుని బయటికి రావాలని పరిగెత్తుతూ తొందరలో గర్భగుడి వెలుపల నున్న నందీశ్వరుడి విగ్రహంపై పడి తల పగిలి వెంటనే మరణించాడు.
నిజానికి అటువంటి పాపాత్ముడు నరకాన్ని పొందాలి. కానీ తెలియకనే శివరాత్రి నాడు ఉపవాసం చేసి, జాగరణము ఉండి, శివాలయానికి అంతదూరం నడిచి వెళ్ళి దీపం వెలిగించిన కారణంగా అతనికి అనంత పుణ్యం లభించి కైలాసం ప్రాప్తించింది.
గుణనిధి మరు జన్మలో ‘అరిందముడ’నే శివభక్తుడైన రాజుగానూ, ఆ మరుసటి జన్మలో పులస్త్య మహాముని కుమారుడయిన ‘విశ్రవుడ’నే ఉత్తముడికి ‘వైశ్రవణుడు’ అనే పేరుతో పుత్రుడిగానూ జన్మించాడు.
వైశ్రవణుడు గత జన్మ సంస్కారం వలన అమిత శివ భక్తుడయాడు. శివుడి గూర్చి తీవ్ర తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో సిరిసంపదలకు నిలయమై, వైభవోపేతమై అలరారే ‘అలకాపురి’ అనే పట్టణానికి రాజై, యక్ష జాతికి నాయకుడై నవ నిధులకు అధిపతియై, చిరంజీవిగా, శివుడి ప్రియ మిత్రుడిగా ‘కుబేరుడు’ అనే నామంతో వర్ధిల్లుతున్నాడు.