వరుస ఏసీబీ దాడులతో అధికారుల్లో హడల్
విజయవాడ,
ఇటీవల అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తరచూ ఏదో ఒక ప్రాంతంలో అవినీతి చేపలను పట్టేస్తోంది. దీంతో మిగిలిన ఉద్యోగుల గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి. ఏసీబీ అధికారులు ఎప్పుడు, ఏ రూపంలో వచ్చి దాడి చేస్తారోనన్న భయంతో కార్యాలయాలకు సైతం సరిగా వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లినా కాసేపు మాత్రమే సీట్లో కూర్చుని.. తుర్రుమంటున్నారు. ఎక్కడికెళ్లారని ఎవరైనా ప్రశ్నిస్తే.. క్యాంపుల పేరు చెబుతున్నారు. ఈ కోవలోనే కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలోని ‘ముఖ్య’ అధికారి కూడా ఏసీబీ ‘ఫీవర్’తో వణికిపోతున్నట్లు తెలిసింది. ఈ నెల 16న కల్లూరు ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏ మద్దిలేటి ఓ గన్‌లైసెన్స్ అప్‌గ్రేడ్ విషయంలో దరఖాస్తుదారుడికి అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనికి ముందు ఈ నెల ఎనిమిదో తేదీన రూ.4 లక్షల లంచం కేసులో గూడూరు తహసీల్దార్ షేక్ హసీనాబీపై ఏసీబీ కేసు నమోదైంది.అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. ఈ పరిణామాలతో కల్లూరు మండల ‘ముఖ్య’ అధికారిలోనూ వణుకు మొదలైంది. పైగా ఆయన..హసీనాబీతో ఫోన్‌లో సంభాషించారని, ఈ విషయం ఏసీబీకి తెలియడంతో విచారణ కూడా చేసిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో తనకు కూడా ఏసీబీ ఉచ్చు బిగిస్తుందనే భయంతో కార్యాలయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఓ జిల్లా ఉన్నతాధికారి సైతం ‘బీకేర్ ఫుల్’ అని హెచ్చరించడంతో పాటు ఎక్కువ సమయం కార్యాలయంలో కూర్చోవద్దని సలహా ఇచి్చనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ పది అర్జీలపై చకచకా సంతకాలు చేసేసి..మీటింగ్‌లు, క్యాంపులంటూ వెళ్లిపోతున్నారు. ‘ముఖ్య’ అధికారి అందుబాటు ఉండకపోవడంతో వివిధ పనుల నిమిత్తం కల్లూరు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలు అవస్థ పడుతున్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలు, ఇంటి పట్టా మార్పిడి, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, ఆన్‌లైన్‌లో భూమి నమోదు, పట్టాదారు పాసుపుస్తకాల జారీ వంటి పనులు ఆలస్యమవుతున్నాయి