YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహా రాజకీయాలపై వ్యూహాత్మక మౌనం

మహా రాజకీయాలపై వ్యూహాత్మక మౌనం

మహా రాజకీయాలపై వ్యూహాత్మక మౌనం
హైద్రాబాద్, 
మహారాష్ట్ర రాజకీయాలు నెలరోజులకుపైగా రకరకాల మలుపులు తిరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎలాగో తమ నేతలకు అనుకూలంగా మాట్లాడతాయి. ఇవి మినహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇతర పార్టీల నేతలెవరూ ఈ విషయమై నోరు మెదపడం లేదు. తెల్లారే సరికే ఫడ్నవీస్ సీఎం కావడం, తర్వాత బలనిరూపణ సాధ్యం కాదని తేలడంతో రాజీనామా చేయడం.. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణం చేస్తుండటం.. వీటిలో ఈ ఎపిసోడ్ మీద కూడా ఏపీ, తెలంగాణకు చెందిన పొలిటిషియన్స్ మాట్లాడలేదు.
బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలను నెరపడానికి ప్రాధాన్యం ఇస్తోన్న వైఎస్ఆర్సీపీ ‘మహా’ రాజకీయాలపై స్పందించలేదు. ఏపీ బీజేపీ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా.. జగన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. కేంద్రంతో సత్సంబంధాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి తరుణంలో మరో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడతారని ఆశించలేం.ఒకప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉండి.. ఎన్నికల ముందు దూరమైన టీడీపీ కూడా ‘మహా’ పవర్ గేమ్ గురించి స్పందించలేదు. గత ఏడాది కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుకకు చంద్రబాబు అతిథిగా వెళ్లారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమే లక్ష్యంగా బాబు పని చేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో ఆయన, టీడీపీ.. మహారాష్ట్ర రాజకీయాల పట్ల స్పందించలేదు.జనసేన పార్టీ కూడా మహారాష్ట్ర రాజకీయాల విషయమై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లొచ్చారు. కానీ జాతీయ రాజకీయాలపై ఆయన ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదు. బీజేపీకి జనసేన దగ్గరవుతోందని ప్రచారం జరుగుతున్న వేళ.. పవన్ మహారాష్ట్ర రాజకీయాలపై నోరు మెదపకపోవడం గమనార్హం.ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా పొరుగున ఉన్న మహారాష్ట్ర రాజకీయాల గురించి సైలెంట్‌గా ఉండిపోయింది. లోక్ సభ ఎన్నికల ముందు ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తామని.. కేంద్రంలో కీలకంగా మారతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ దిశగా స్టాలిన్, మమత, జగన్‌లతో చర్చలు జరిపారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ కావడంతో.. ఏ పార్టీకి మద్దతు పలికే స్థితిలోనూ కేసీఆర్ లేరు.‘మహా’ పరిణామాలపై ట్విట్టర్ ద్వారా పరోక్షంగా స్పందించిన ఏకైక పార్టీ మజ్లిస్. న్యూస్ ఛానళ్ల ట్వీట్లను రీట్వీట్ చేసిన ఈ పార్టీ.. మహారాష్ట్రలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. శివసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని పరోక్షంగా విమర్శించిన ఏఐఎంఐఎం.. రాజ్యాంగ దినోత్సవం రోజున బీజేపీని విమర్శించింది. బీజేపీని విమర్శించడం తనకు ప్రయోజనకరం కావడంతో.. ఓవైసీ బీజేపీని విమర్శించారు. కానీ ‘మహా’ పాలిటిక్స్ గురించి నేరుగా మాట్లాడలేదు .మహారాష్ట్రలో ఎవరూ అధికారంలోకి వచ్చినా తమకు వచ్చిన నష్టమేం లేదనే కారణంతోనే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు నోరు మెదపలేదు. కానీ ‘మహా’ పరిణామాలను అవి జాగ్రత్తగా గమనించాయి. బీజేపీ బలపడటం ఇష్టం లేని పార్టీలు లోలోపల హ్యాపీగా ఉండి ఉంటాయి. బీజేపీ నేతలకు మాత్రం.. ఇలా జరిగిందేంటని కాస్త బీపీ పెరిగి ఉండొచ్చు. తెలుగు పార్టీలను కూడా శివసేన లైట్ తీస్కోంది. యూపీఏ భాగస్వామ్య పార్టీ డీఎంకే అగ్రనేత స్టాలిన్‌కు ఆహ్వానం పంపిన ఉద్దవ్.. తెలుగు రాష్ట్రాల సీఎంలను, పార్టీల అధినేతలను తన ప్రమాణ స్వీకార వేడుకకు పిలువలేదని సమాచారం

Related Posts