మహాలో చాణుక్యలు ఎవరు..
ముంబై,
మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. అజిత్ పవార్‌ను అతిగా ఊహించుకొని బీజేపీ నష్టపోయిందని.. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందు ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ప్రభుత్వాన్ని నడపడానికి సరిపడా మెజార్టీ తమకు లేదని ఫడ్నవీస్ తెలిపారు. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అయిన అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని నడపొచ్చని భావించిన బీజేపీకి ఇదో రకంగా షాకే.ఈ ఎపిసోడ్‌లో శరద్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది. శివసేన, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం చర్చలు జరుగుతుండగానే ‘రైతుల సమస్య’పై చర్చించడం కోసం ప్రధానితో పవార్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌తో చర్చల తర్వాత ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా రాత్రికి రాత్రే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడం సంచలనమైంది.శరద్ పవార్ కావాలనే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. అజిత్ పవార్‌ను బీజేపీ క్యాంపులోకి పంపిన తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తేశారని.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని.. ఆ తర్వాత బలపరీక్షకు ఆదేశాలొచ్చిన తర్వాత.. డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారని.. ఆ తర్వాత ఎన్సీపీలోకి వచ్చారని చెబుతున్నారు.ఇదంతా శరద్ పవార్ చాణక్యమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. శరద్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో అజిత్‌పై ఉన్న ఇరిగేషన్ స్కాం కేసులు కూడా మాఫీ అయ్యాయని చెబుతున్నారు. కానీ ఈ ప్రచారాన్ని మహారాష్ట్ర ఏసీబీ డీజీ ఖండించారు. తాము అజిత్ పవార్ దగ్గరకు వెళ్లలేదని.. ఆయనే తమ దగ్గరకు వచ్చారని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఎన్నికల వ్యూహాలు రచించడంలో అమిత్ షా దిట్ట. బీజేపీకి సరిపడా సీట్లు రాకపోయినా.. పక్క పార్టీలను మచ్చిక చేసుకోవడంలో.. ప్రత్యర్థి పార్టీలను కకావికలం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ఎపిసోడ్ తర్వాత అమిత్ షాను మించిన అపర చాణక్యుడు శరద్ పవార్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరి మహారాష్ట్ర అమిత్ షా విషయంలో వ్యూహాలు ఇక్కడితో ఆగిపోతాయా? వేచి చూడాల్సిందే