ఆరు నెలల పాలనలో ఎవరు గెలిచారు
విజయవాడ,
జగన్ ఆరు నెలల పాలనలో ఒక పదం మాత్రం ఎక్కడా పలకడంలేదు. నిజానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ఆ పదం పలకడానికి పెద్దగా ఇష్టం చూపించలేదు. అయితే జగన్ ఇపుడు ముఖ్యమంత్రి. ఆయన సీఎం అయ్యాక పెద్ద వివాదంగా మారినదీ అదే అంశం. అసలు వివాదం అయిందా? చేసారా? అన్నది పక్కన పెడితే అమరావతి చంద్రబాబు ఈ రెండూ కూడా కలిపి జగన్ చూస్తున్నారని, అందుకే ఆయన ఆ పేరు సైతం పలికేందుకు అంగీకరించడంలేదని అంటున్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో వైసీపీ మంత్రులు రకరకాలుగా మాట్లాడుతూ జనంలో గందరగోళం స్రుష్టించారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే అమరావతి రాజధాని పేరు మీద ఒకే ఒక సామాజికవర్గం మాత్రమే ఆధిపత్యం చలాయిస్తోందని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాలు, ప్రాంతాలకు రాజధానిలో చోటు ఉండేలా తాము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. రాజధాని ఎక్కడ అన్నది తాము నియమించిన నిపుణుల కమిటీ తేలుస్తుందని కూడా బొత్స అంటున్నారు.ఇక జగన్ క్యాబినెట్ లో ఉన్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తీరు చూస్తే ఇలాగే ఉంది. ఆయన రాజధాని కట్టే ఆర్ధిక స్తోమత తమ ప్రభుత్వానికి లేదని కుండబద్దలు కొట్టారు. ఆయన ఆ మాట సింగపూర్లో చెప్పారు. ఢిల్లీలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పారు. తమ దగ్గర ఉన్న నిధులు బాబు చెప్పినట్లుగా రాజధాని కట్టడానికి అసలు సరిపోవు, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిందని కూడా ఆయన అంటున్నారు. ఈ నేపధ్యంలో రాజధాని అన్నది పెద్ద వివాదంగా మారిందనే అంటున్నారు. జగన్ ఇంత జరుగుతున్నా కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం అనుమానాలకు తావు ఇస్తోంది.ఇవన్నీ ఇలా ఉండగానే కేంద్రం ఈ మధ్య విడుదల చేసిన భారత దేశం కొత్త మ్యాపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి లేకపోవడంతో జనంలో సైతం కొత్త సందేహాలు పుట్టుకు వచ్చాయి. అసలు అమరావతి అన్నది కేంద్రం దృష్టిలో లేదా? లేక కావాలనే పక్కన పెట్టారా? అని కూడా చర్చ మొదలైంది. ఈ పరిణామాలతో వైసీపీ సంగతేమో కానీ టీడీపీలో కొత్త గుబులు మొదలైంది. వైసీపీకి ఎటూ రాజధాని ఇష్టం లేదు, కేంద్రం సైతం అమరావతిని గుర్తించకపోతే బాబు కలల రాజధాని కనుమరుగేనా అన్న భయం తమ్ముళ్ళలో ఒక్కసారిగా ఆవహించింది.దీనిమీద శీతాకాల పార్లమెంట్ సమావేశాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గట్టిగా ప్రశ్నించడంతో కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకుని జరిగింది పొరపాటే తప్ప మరేమీ కాదని పేర్కొంది. వెంటనే అమరావతి ఏపీ రాజధానిగా గుర్తిస్తూ మ్యాపులో కూడా కొత్త సవరణలు చేసింది. దీంతో చంద్రబాబుకు వేయి ఏనుగుల బలం వచ్చినట్లైంది. అమరావతిని తానే కట్టాను అని చెప్పుకోవడానికి ఆయనకు గొప్ప అవకాశం వచ్చేసింది. కేంద్రం సైతం మ్యాపులో అమరావతిని రాజధానిగా పెట్టటం వల్ల జగన్ సర్కార్ కి కూడా దాన్ని కాదని ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేదని చెప్పాలి. మొత్తానికి అమరావతి విషయంలో ఇంతకాలం మౌనంగా ఉన్న జగన్ మీద చంద్రేబాబు ఈ విధంగా విజయం సాధించారని తమ్ముళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.