ఇరవై నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో కార్యాలయం
రంగారెడ్డి
సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అనంతరం 24 రోజుల తర్వాత గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయం తెరుచుకుంది. ఘటన జరిగిన భవనాన్ని ఖాళీ చేసి..నూతన భవనంలో కార్యాలయం ప్రారంభించారు. ఎమ్మార్వో వెంకట్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే ఈ నెల 4వ తేదీన హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేష్ కూడా మృతి చెందాడు. ఈ సంఘటన అనంతరం కార్యాలయం మూతపడింది. నేడు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నూతన కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించారు.