రైతు రుణాలకు సిబిల్ అర్హత తొలగించాలి: విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ
రైతుల సిబిల్ స్కోరు ప్రాతిపదికపైనే వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ విధించిన షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ ‘వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించి రైతులకు సకాలంలో రుణం లభించడం ఎంతో ముఖ్యం. రైతులకు రుణాలు మంజూరీ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషిస్తుంటాయి. అయితే వ్యవసాయ రుణాల మంజూరీకి సంబంధించి బ్యాంకులకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలలో అత్యంత ఆక్షేపణీయమైనది సిబిల్ స్కోరు’ అని అన్నారు.రైతు సిబిల్ స్కోరు ప్రాతిపదికపైనే రుణం మంజూరు చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ షరతు కారణంగా రుణాలు అందక రైతులు అవస్థల పాలవుతున్నారని ఆయన చెప్పారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సిబిల్‌లో నమోదైన లావాదేవీల ప్రాతిపదికన డిఫాల్టర్లుగా లేదా సకాలంలో వాయిదాలు చెల్లించలేదన్న కుంటి సాకులతో వ్యవసాయ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంక్‌లు నిరాకరిస్తున్న విషయాన్ని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు రైతులకు మేలు చేయకపోగా కఠినతరమైన ఇలాంటి నిబంధనల వలన వారిని మరిన్ని ఇక్కట్లకు గురిచేయడం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా వర్షాధారం. వరదలు, వడగళ్లు, కరువు కాటకాలతో వాతావరణంలో సంభవించే ఆకస్మిక పరిణామాల కారణంగా 75 నుంచి 80 శాతం రైతులు నష్టపోతున్నారని ఆయన చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను కోల్పోయి రైతులు దిక్కులేని స్థితిలో పడిపోయి వ్యవసాయ రుణాలు చెల్లించలేక డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితులలో రైతుల సిబిల్ స్కోరు ప్రాతిపదికన వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలన్న నిబంధన ఏ విధంగా సహేతుకం అవుతుందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కాబట్టి వ్యవసాయ రుణాల మంజూరీకి సిబిల్ స్కోరు తప్పనిసరి చేసే నిబంధనను తక్షణమే తొలగించి, విశ్వసనీయత ప్రాతిపదికపైనే బ్యాంకులు రైతులకు రుణాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.