YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌...కంపెనీలకు ఏం కావాలి?

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌...కంపెనీలకు ఏం కావాలి?

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ సందడి మొదలైంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ప్లేస్‌మెంట్స్‌ ప్రక్రియ మరింత ఊపందుకుంటుంది. తరగతి గది నుంచే విద్యార్థి జీవితం నుంచి ఉద్యోగిగా ఎదగడానికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఎంతో దోహదం చేస్తాయి. ఇందులో నెగ్గాలంటే మాత్రం నైపుణ్యాలకు పదును పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం చాలా కంపెనీలు మెరిట్‌ కంటే నైపుణ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

 

ఆసక్తికి తగ్గ సామర్థ్యాలు....

మీకు బిజినెస్‌ ఎనలిటిక్స్‌ అంటే ఆసక్తి ఉందనుకుందాం. ఆ రంగానికి అవసరమైన సామర్థ్యాలను మీరు పెంపొందించుకోవాలి. ఐటీ రంగం అంటే ఆసక్తి ఉంటే కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ సామర్థ్యాలపై దృష్టిపెట్టాలి. డొమైన నాలెడ్జ్‌ విషయంలో రాజీ పడొద్దు. దానికి అదనంగా ఏమి అవసరమో తెలుసుకుని నేర్చుకోవాలి. కంపెనీల వెబ్‌సైట్లలో అభ్యర్థుల నుంచి తాము ఏమి ఆశిస్తుందీ ప్రస్తావిస్తారు. దాని ఆధారంగా కూడా ప్లేస్‌మెంట్లకు సిద్ధం కావచ్చు.

నాస్‌కామ్‌ నివేదిక ప్రకారం... మనదేశంలో ఐటీ - బీపీఓ కంపెనీలే అతిపెద్ద నియామక రంగం. దాదాపు 30 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. మల్టీ స్కిల్డ్‌ ప్రొఫెషనల్స్‌ అవసరం ఈ రంగంలో పెరుగుతోంది.

పూర్తిగా సామర్థ్యాల ఆధారంగా ఉద్యోగాలు కల్పించే దిశగా కంపెనీలు పయనిస్తున్నాయి. వీటిలో అడోబ్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌, స్నాప్‌డీల్‌, శాప్‌ ల్యాబ్స్‌ అగ్రశ్రేణి నియామక సంస్థలుగా ఉన్నాయి. ప్రాసెస్‌ రంగంలో అమెక్‌ ఫాస్టర్‌ వీలర్‌, బీఏఎస్‌ఎఫ్‌, బీపీసీఎల్‌, ఫ్లోర్‌ డేనియల్‌, లండే, ష్లుంబర్గర్‌, యూఓపీ హానీవెల్‌ తదితర కంపెనీలు నియామకాలు చేపడుతున్నాయి. కన్సల్టెనీ కంపెనీల్లో పీడబ్ల్యుసీ, పీడబ్లుసీ యాక్చూ రియల్‌ సర్వీసెస్‌, డెలాయిట్‌, ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌, మ్యూ - సిగ్మా, జడ్‌ఎస్‌ అసోసియేట్స్‌, బ్యాంకింగ్‌లో హెచ్‌ఎస్‌బీసీ, డీసీబీ బ్యాంక్‌ ప్రధానమైనవి.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌, స్టాటిస్టికల్‌ అనాలసిస్‌, అల్గోరిథమ్‌ డిజైన్‌, డేటా ప్రెజెంటేషన్‌, ప్రోగ్రామ్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ముదలైన సామర్థ్యాలున్న అభ్య ర్థులకు క్యాంపస్‌ నియామకాల్లో డిమాండ్‌ ఉంటుంది.

 

కాలేజీలు ఏం చేయాలి?

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు విధ్యార్థులను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించాలి. వివిధ రకాల పరిశ్రమలు, కంపెనీల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. పరిశ్రమల గురించి బాగా తెలిసినవాశ్లు, ప్రొఫెషనల్స్‌ను కాలేజీకి ఆహ్వానించి విద్యార్థులతో ఇంటరాక్షన్‌ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. ప్రస్తుతం కంపెనీలు జనరిక్‌ సామర్థ్యాల కంటే ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత పరిశ్రమలతో కాలేజీలు సంబంధాలు ఏర్పరచుకోవాలి.

 

ఇంటర్య్యూలలో...

డిగ్రీ ఉత్తీర్ణులై, డొమైన్‌ నాలెడ్జ్‌ ఉంటే ఇంటర్వ్యూ వరకు వెళ్తారు. అక్కడ పరీక్షించే అంశాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీకున్న సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం ఇంటర్వ్యూలో కీలకంగా మారతాయి. ఐటీ కంపెనీలు తమకు అవసరం ఉన్న ప్రత్యేక విభాగానికి సంబంధించిన తెలివితేటలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే అభ్యర్థి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, బిహేవియరల్‌ స్కిల్స్‌, గుడ్‌ మార్నింగ్‌ / గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌ / థ్యాంక్యూ చెప్పడం, వేళ్లేటప్పుడు చైర్‌ను సరిగా పెట్టడం లాంటి లక్షణాలు, అలవాట్లను కూడా నిశితంగా పరిశీలిస్తాయి.

 

నేరుగా పని చేసే సామర్థ్యం

ఒకప్పుడు ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌పై కొంచెం పట్టున్న వారిని తీసుకుని, వేతనమిస్తూ ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చేవి. కానీ ప్రస్తుతం చాలా సంస్థలు ఆ శిక్షణ కాలాన్ని మూడు నెలలకు కుదించాయి. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో.. శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే, నేరుగా పని చేసే సామర్థ్యం ఉన్న వారి కోసమే అన్వేషిస్తున్నాయి. ఈక్రమంలో నేరుగా ప్రాజెక్టులో పని చేయడానికి అవస రమైన కోడింగ్‌ నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే నియమిం చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అన్ని బ్రాంచీల వారికి మొదటి సంవత్సరం సిలబస్‌లో సి, సి++ లాంగ్వేజెస్‌ ఉంటాయి. నాన్‌-సర్క్యూట్‌ బ్రాంచీలు అయిన మెకానికల్‌, సివిల్‌ వంటి వాటికి తరవాత ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ఉండవు. ఇది ఆయా బ్రాంచ్‌ల వారికి సవాలుగా మారింది. కాబట్టి కోడింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందిం చుకోవడం ద్వారా ఈ సవాలును అధిగమించవచ్చు.

 

కోడింగ్‌కు ప్రాధాన్యం

ప్రస్తుతం క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో మార్పు వచ్చింది. గతంలో ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లీష్‌ అంశాల ప్రాతిపదికగా నియామకాలు ఉండేవి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కోడింగ్‌ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. విప్రో, క్యాప్‌జెమిని, టిసిఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి సర్వీస్‌ కంపెనీలు కూడా కోడింగ్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తున్నాయి. అంతేకాకుండా టెక్నాలజీ స్కిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నాయి. అంటే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి నూతన సాంకేతికతపై విద్యార్థుల అవగాహనను పరీక్షిస్తున్నాయి. వీటిల్లో ఏదో ఒక టెక్నాలజీపై పట్టు, కోడింగ్‌ స్కిల్స్‌ ఉంటే రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా ఏ విద్యార్థి అయిన కోడింగ్‌, టెక్నికల్‌ స్కిల్స్‌ను మెరుగుపరుచు కోవాలి. ఆయా అంశాల్లో సర్టిఫికేషన్స్‌ చేయడం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే ఉద్యోగం లభించటం చాలా కష్టతరమవుతుంది. ప్రస్తుతం సర్వీస్‌ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్‌ తగ్గాయి. ప్రొడక్ట్‌ కంపెనీల్లో రిక్రూట్‌మెంట్‌ బాగా పెరిగింది. అయితే ఇవి ఆఫర్‌ చేసే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి. కానీ వేతనాలు మాత్రం ఎక్కువ. ఈ కంపెనీలు దాదాపు రూ. 6-12 లక్షల మధ్యలో వేతనాలను అందజేస్తాయి. సర్వీస్‌ కంపెనీల్లో గతంలో మాస్‌ రిక్రూట్‌మెంట్‌ ఉండేది. అంటే వందల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునేవి. ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గింది. ఈ కంపెనీలు రూ. 3.5 లక్షల వరకు వేతనాలను అందజేస్తాయి. ప్రస్తుతం మా కాలేజీలో 700 మంది విద్యార్థులకు ఆఫర్స్‌ వచ్చాయి. తరవాతి సెమిస్టర్‌లో కోర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌కు వస్తాయి. ఇవి సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులను రిక్రూట్‌ చేసుకుంటాయి.

 

 

ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ తప్పనిసరి 

గతంలో బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లీష్‌ వంటి అంశాల్లో చక్కటి ప్రతిభను కనబరిస్తే టిసిఎస్‌ వంటి కంపెనీలు నేరుగా జాబ్‌ను ఆఫర్‌ చేసేవి. తరవాత వారి అవసరాలకు అనుగుణంగా 6-9 నెలల వరకు శిక్షణనిచ్చి ఉద్యోగంలోకి తీసుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. స్మార్ట్‌ టెక్నాలజీ కారణంగా సంబంధిత అంశాలపై విద్యార్థులకు స్వీయ అవగాహన ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఆయా అంశాలపై పట్టు ఉంటేనే స్వల్ప కాలం ఉండే శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. సాఫ్ట్‌ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌ (ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌) తప్పనిసరిగా మారాయి. అదేవిధంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లీష్‌ వంటి అంశాలతోపాటు ప్రోగ్రామింగ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, లైవ్‌ కోడింగ్‌ పేరుతో ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తున్నారు. ఇటీవల టిసిఎస్‌ కంపెనీ మెరిట్‌, బ్యాక్‌లాగ్స్‌తో నిమిత్తం లేకుండా ప్రోగ్రామింగ్‌ టెస్ట్‌లో చక్కని ప్రతిభ చూపిన వారికి నేరుగా జాబ్‌ ఆఫర్‌ ఇచ్చింది. చాలా కంపెనీలు కోడ్‌ వీటా, క్యాంపస్‌ కనెక్ట్‌ వంటి పేర్లతో పోటీలను నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా మెరిట్‌ సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలను ఆఫర్‌ చేస్తున్నాయి. స్టార్టప్‌ కంపెనీలయితే డాట్‌నెట్‌, జావా వంటి ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ను మాత్రమే పరీక్షిస్తున్నాయి. ఒకప్పుడు మెరిట్‌ విద్యార్థులకే ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్స్‌ వచ్చేవి. దీంతో మెరిట్‌ విద్యార్థులు కూడా తరవాతి చదువుల మీద దృష్టి సారించకపోవడం, ఉన్నత విద్య వైపు చూడకపోవడం జరిగింది. ప్రస్తుతం నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ దాదాపుగా ముగిసే సమయం నుంచి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహి స్తున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ విషయంలో ప్రస్తుతం టైర్‌ - 1 కాలేజీల్లో మాత్రమే పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉంది.

Related Posts