రక్తదానం సామాజిక బాధ్యత - జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
దాతలకు కలెక్టర్ అభినందన
సిరిసిల్ల, నవంబర్ 28(న్యూస్ పల్స్):
సామాజిక బాధ్యత గా ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసే గొప్ప గుణాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం లోని స్వశక్తి పొదుపు భవన్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల సంఘం ( డోర్స్) ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి రక్త దాన శిబిరం ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, రక్తాన్ని దానం చేయడం వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షించినవారవుతారన్నారు.రక్తం ఉత్పత్తి చేసే వస్తువు కాదు కాబట్టి, ఇది కేవలం మానవ మాత్రులకు మాత్రమే సాధ్యమయ్యే అరుదైన వరమన్నారు. జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం హర్షనీయమన్నారు. రక్తదానం ప్రాణాదాతం తో సమానమన్నారు. స్వచ్చందంగా రక్తదానం చేయడం అనేది ప్రతీ ఒక్కరూ సేవగా కాకుండా భాద్యతగా తీసుకోవాలన్నారు. రక్తదాన ఆవశ్యకతను తప్పనిసరిగా ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. రక్తదానం పట్ల చాల మందికి అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తుందన్నారు.
జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రక్త దాతలకు పండ్లు అందించి అభినందించారు.