YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మన చేప సూపర్.. (కృష్ణాజిల్లా)

మన చేప సూపర్.. (కృష్ణాజిల్లా)

మన చేప సూపర్.. (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, : మత్స్య ఉత్పత్తులతోపాటు ఎగుమతిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రభుత్వం మత్స్యరంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ మత్స్యకారుల జీవనోపాధి పెంపొందించేందుకు అనేక రాయితీలు కల్పిస్తోంది. ఇది కొంత వరకు ఫలితం ఇస్తున్నా అందుబాటులో ఉన్న పథకాలు క్షేత్రస్థాయిలో అంతంత మాత్రంగా అమలవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు తీర ప్రాంత అభివృద్ధి, కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటే ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కూడా సముద్రాన్ని నమ్ముకుని చేపలవేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. మచిలీపట్నంతోపాటు నాగాయలంక, కృత్తివెన్ను తీరంలో ఎక్కువగా ట్యూనా చేపలు దొరుకుతుంటాయి. ఇక్కడ దొరికే మత్స్యసంపదలో ఎక్కువ శాతం ఇవే ఉంటాయి. కానీ తక్కువ పరిమాణంలో ఉన్నవాటిని మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. పెద్ద వాటిని పట్టుకోవాలంటే సముద్రపు లోతుల్లో వేట సాగించాల్సి ఉంటుంది. డీప్‌ సీ ఫిషింగ్‌కు అనువైన గాలాలు, పడవలు, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఐస్‌ బాక్సులు తదితరాలు అవసరం. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎప్పటి నుంచో చెబుతున్నా ఆదిశగా అధికారులు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆదిశగా వసతులు కల్పిస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లి వేటసాగించడానికి అవకాశం ఉంటుందని ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. సముద్ర తీర ప్రాంతంలో దొరికిన ఉత్పత్తులను సకాలంలో విక్రయించుకోలేక పోవడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వ హయాంలో పలుచోట్ల జెట్టీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కృత్తివెన్ను మండలంలోని ఒర్లగొందితిప్పలో రూ.2.75 కోట్లు ఆర్‌కేవీవైలో భాగంగా జెట్టీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఉన్న గుల్లలమోద, సొర్లగొంది, జింకవానిపాలెం, నాచుగుంట, పెదపట్నం తదితర ప్రాంతాల్లోని ల్యాండింగ్‌ సెంటర్లు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జెట్టీలు లేని కారణంగా నరసాపురం, అంతర్వేది ప్రాంతాలకు వెళ్లి చేపలను విక్రయించుకోవాల్సి వస్తుందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సముద్ర ఆధారిత ఉత్పత్తుల కోసం బందరు మండలంలోని కానూరు, కొత్తపల్లె తుమ్మలపాలెం, పోలాటితిప్ప, అవనిగడ్డ నియోజకవర్గంలో సొర్లగొంది, నాగాయలంక తదితర ప్రాంతాల్లో షోర్‌బేస్డ్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ఒక్కోదానికి రూ.కోటి చొప్పున మంజూరు చేశారు. ఏళ్లు గడిచిపోతున్నా ఇంతవరకు అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. నాగాయలంకలో మాత్రం ఒకటి పూర్తయ్యింది. ఆయా కేంద్రాల పనులు త్వరిగతిన పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో సముద్ర ఉత్పత్తుల వాటా 30 శాతానికిపైగా ఉంటే మిగిలింది చెరువుల ద్వారానే ఉంటుంది. ఎక్కువ శాతం ఉప్పు, మంచినీటి చెరువుల్లోనే చేపలు, రొయ్యలు సాగవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 21 వేల హెక్టార్ల రొయ్యల చెరువులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఆక్వాద్వారా వచ్చే ఆదాయం రూ.40 వేల కోట్లయితే, అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ.24 వేల కోట్లు అంటే మన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్ఛు సాగును మరింతగా ప్రోత్సహించేందుకు, పథకాలను రైతులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ఆక్వా జోన్లు ఏర్పాటు చేసింది. రైతులందరినీ బృందాలుగా చేసి జిల్లా వ్యాప్తంగా 112 జోన్లు ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం జిల్లాలో ఆక్వా ల్యాబ్‌లు లేక చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల కోసం కైకలూరులో ప్రభుత్వం ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాల నుంచి ఆక్వా రైతులు ఇక్కడకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. రొయ్యలకు సంబంధించిన ల్యాబ్‌ కోసం ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాధి నిర్ధరణకే రోజుల తరబడి సమయం పట్టడంతో పంట నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, బంటుమిల్లి, కలిదిండి ప్రాంతాల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. కొన్ని చోట్ల భూమి పూజలు కూడా చేశారు. తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. మళ్లీ మత్స్యకారులు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా అనుమతులు జారీ చేసింది. త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. చేపల విక్రయాలు సాగించేందుకు ప్రతి మండల కేంద్రంలో ఓ మార్కెట్‌ అవసరం ఉందని మత్స్యకార సంఘాల నాయకులు చెబుతున్నారు. మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి లాంటి ప్రాంతాల్లో మార్కెట్లు ఉన్నాయి. చాలాచోట్ల మత్స్యకారులు రహదారుల పక్కన చేపలు విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రతి మండల కేంద్రంలో ఓ మార్కెట్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా చెరువుల క్రమబద్ధీకరణలో భాగంగా గుర్తింపులేని చెరువులు అన్నింటినీ క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏరియేటర్లు, విద్యుద్దీపాలు తదితర పరికరాలను రాయితీపై అందిస్తోంది. ఆయా చెరువులకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం, కాల్వల్లో పూడికతీతకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక సంఘాలు, మత్స్యమిత్ర సంఘాలు, మహిళలకు చేపపిల్లల నర్సరీల ఏర్పాటుతోపాటు వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. చేప పిల్లలు, మేతలను రాయితీపై ఇస్తున్నారు.

Related Posts