YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు ఆంధ్ర ప్రదేశ్

ఆటంటే అలుసా..? (చిత్తూరు)

ఆటంటే అలుసా..? (చిత్తూరు)

ఆటంటే అలుసా..? (చిత్తూరు)
చిత్తూరు, :అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో రూ.3.20 కోట్లతో నిర్మిస్తున్న క్రీడా శిక్షణ కేంద్రం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా ప్రాజెక్టు పూర్తయినప్పటికీ.. ఆపై కొనసాగింపు అనుమానంగానే కన్పిస్తోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ కేంద్రం నిర్మాణానికి గుత్తేదారులకు ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్‌లోనే ముగిసింది. చేసిన పనులకూ నిధులు మంజూరు చేయకపోవడంతో కేంద్రం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీ పరిధిలో ఉన్న హార్సిలీహిల్స్‌ సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంది. కొండపై ఆక్సిజన్‌ సాంద్రత తక్కువ. ఇక్కడ గాలి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు అధిక సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి చోట్ల క్రీడాకారులకు శిక్షణ ఇస్తే.. అసాధారణ రీతిలో ఊపిరితిత్తుల సామర్థ్యం వృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇలాంటి కొండప్రాంతాల్లో శిక్షణ ఇవ్వగా క్రీడాకారులు మంచి శారీరక దారుఢ్యం సాధించినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి శిక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలని వడేళ్ల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్లో రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శిగా ఉన్న ఎల్‌వీ సుబ్రహ్మణ్యం 2017 సెప్టెంబరు 17న స్వయంగా హార్సిలీహిల్స్‌కు వచ్చారు. శిక్షణ కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రెవెన్యూశాఖ 3.60 ఎకరాల స్థలాన్ని క్రీడాశాఖకు అప్పగించింది. గతేడాది డిసెంబరు ఏడో తేదీన శిక్షణ కేంద్రం పనులను ఏపీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో గుత్తేదారు ప్రారంభించారు. కొండపై రైల్వే అతిథి గృహం ఎదురుగా ఉన్న స్థలానికి రీటైనింగ్‌ గోడను నిర్మించారు. వివిధ ప్రాంతాల నుంచి మట్టిని తోలి మైదానంగా తయారుచేశారు. ఈ పనుల కోసం ఇప్పటికే రూ.1.90 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వానికి రెండుసార్లు నివేదికలు వెళ్లినా నిధులు విడుదల కాలేదు. అందుకే ఇక పనులు కొనసాగించడం అసాధ్యంగా మారింది. ఈ శిక్షణ కేంద్రంలో పరుగుపందెం ట్రాక్‌లు, ఖోఖో, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులను నిర్మించాల్సి ఉంది. క్రీడాకారులు బస చేయడానికి తాత్కాలికంగా పట్టుశాఖ భవనాలను అద్దెకు తీసుకోవాలని క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ భవనాలకు మరమ్మతులు చేసి.. వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరమ్మతులు చేపట్టడానికి ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. వాస్తవానికి కాంట్రాక్టర్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ శిక్షణ కేంద్రం పనులు ఈ ఏడాది జూన్‌కు పూర్తి కావాలి. నిధుల కొరత కారణంగా గడువును పొడగించినా.. అసంపూర్తిగానే మిగిలింది. ఈ శిక్షణ కేంద్రం హార్సిలీహిల్స్‌కే కాకుండా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని, క్రీడారంగంలో అద్భుత విజయాల సాధనకు కొండపై శిక్షణ దోహదపడుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణాలు మొదలైనందున పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నారు

Related Posts