పీఆర్సీ కోసం ఎదురు చూపులు
నల్గొండ, నవంబర్ 29,
వేతన సవరణ (పీఆర్సీ) కోసం ప్రభుత్వోద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పీఆర్సీపై సర్కారు ఎప్పుడు ప్రకటన చేస్తుందా అని వేచి చూస్తున్నారు. సవరణపై కమిటీకి ఇచ్చిన గడవు ముగిసి వారం కావొస్తున్నా సర్కారు నుంచి పిలుపు రాకపోవడంతో ఏం జరుగుతోందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నివేదిక కోరితే సీఎం చర్చలకు పిలుస్తారని ఆశగా ఉన్నారు.పీఆర్సీ నివేదికను పది, పన్నెం డు రోజుల్లో అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఈ నెల 10న ఆదేశించింది. ఈ గడువు ఈ నెల 22తో ముగిసింది. కమిటీ కూడా నివేదికను రెడీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవటంతో వాళ్లు వేచి చూస్తున్నట్లు సమాచారం. నివేదిక ప్రభుత్వానికి చేరితే తమను సీఎం కేసీఆర్ చర్చలకు ఆహ్వానిస్తారని ఉద్యోగులు అనుకుంటున్నారు. మీటింగ్ లో పెండింగ్ సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకెళ్లొచ్చని భావిస్తున్నారు. ఐఆర్ ఇస్తారా లేక డైరెక్ట్ గా పీఆర్సీ ప్రకటిస్తరా.. ఇస్తే ఎంతిస్తరోననిఉద్యోగుల్లో 15 రోజులుగా చర్చ జరుగుతోంది. పీఆర్సీ నివేదికివ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించాక కమిటీతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. వీళ్లంతా కమిటీ నివేదిక, సిఫార్సులు, ఫిట్ మెంట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల కొరతపై చర్చించినట్లు తెలిసింది. ఫిట్ మెంట్ ఎంతిస్తే ఎంత భారం పడుతుందో కమిటీకి ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.పీఆర్సీపై గతేడాది మే నెలలో చైర్మన్ సీఆర్ బిశ్వా ల్, సభ్యులు ఉమామహేశ్వరావు, మహ్మద్ ఆలీ రఫత్‌లతో ప్రభుత్వం కమిటీ వేసింది. మామూలుగా ఒకే అధికారితో కమిటీ వేస్తుంటారు. కానీ నివేదిక తొందరగా అందించాలని ఈసారి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌లతో కమిటీ వేశారు. ఏడాదిన్నర నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లతో కమిటీ చర్చించింది. ప్రతిపాదనలు తీసుకుంది. వాటిని అధ్యయనం చేసి సిఫార్సుల నివేదికను రూపొందించినట్లు తెలుస్తోంది.52 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు. ప్రభుత్వమూ కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో ఇక పీఆర్సీ నివేదికను త్వరలోనే ప్రభుత్వం అడిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కోరితే ఇచ్చేందుకు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమని కమిటీలోని ఓ అధికారి తెలిపారు.