కృష్ణా టీడీపీ కకావికలం...
ఒక్కొక్కరుగా దూరమౌతున్న నేతలు
విజయవాడ, నవంబర్ 29,
కృష్ణా జిల్లా టీడీపీ పరిస్థితి ఏంటి ? టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో టీడీపీ ఇప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కొంటోంది? మున్ముందు టీడీపీకి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్ప డు ఇదే ఇక్కడ ఆసక్తికర చర్చగా సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. 2014లో పార్టీ పరిస్థితి చాలా ఆశాజనకం. భారీ స్థానాల్లో విజయం సాధించి పసుపు కోటగా మారింది. పామర్రు, గుడివాడ, విజయవాడ పశ్చిమ, తిరువూరు, నూజివీడు మినహా.. మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, తర్వాత చేసిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పామర్రు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకు న్నారు.దీంతో ఇక, ఈ ఏడాది ఎన్నికలకు ముందు ఈ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పుంజుకుంది. కేవలం రెండు నియోజకవర్గాల్లో గన్న వరం, విజయవాడ తూర్పు మినహా మిగిలిన చోట్ల వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. దీంతో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై చర్చ సాగుతోంది. కీలకమైన నాయకులు ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. కొందరు పార్టీలోనే ఉన్నా.. అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరికొందరు.. పార్టీకి దూరం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.అవనిగడ్డ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ డిప్యూటీ స్పీకర్ బుద్ద ప్రసాద్ కాడి వదిలేశారు. పార్టీలో ఆయన ఎక్కడా వాయిస్ వినిపించకపోగా, కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన వీఆర్ఎస్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక, పామర్రులో టీడీపీ జెండా మోసిన మాజీ వైసీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన కూడా ఇప్పుడు పార్టీని పట్టించుకోడం లేదు. చంద్రబాబు ఇస్తున్న నిరసన పిలుపులకు కూడా ఆమె స్పందించడం లేదు. ఆమె రాజకీయాలకు దూరమే అంటున్నారు. ఇక, విజయవాడ పశ్చిమలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జలీల్ ఖాన్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె షబానా ఖతూన్‌ను రంగంలోకిదింపినా.. ఓడిపోయింది.దీంతో ఖతూన్ వెంటనే అమెరికాకు వెళ్లిపోవడం, అనారోగ్య కారణాలతో జలీల్ పార్టీకి దూరంగా ఉండడం తెలిసిందే. ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతారని కూడా అంటున్నారు. ఇక, తూర్పున గెలిచిన గద్దె రామ్మోహన్ తన పనితాను చూసుకుంటున్నారే తప్ప యాక్టివ్‌గా లేరు. అదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్త నేతగానే కొనసాగుతున్నారు. కొన్ని కార్యక్రమాల్లో ఉంటున్నారు. మరిన్ని కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. ఇక, పెనమలూరులో ఓడిన బోడే ప్రసాద్ యాక్టివ్‌గానే ఉన్నా.. నియోజకవర్గంలో గ్రూపులను ఆయన మెయిన్ టెయిన్ చేయలేక పోతున్నారు. దీంతో టీడీపీ పెద్దగా యాక్టివ్ రోల్ పోషించడం లేదు. ఇక, నూజివీడులో టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. తన పాత పరిచయాలను అడ్డు పెట్టుకుని వైసీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు.కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి.. జయమంగళ వెంకట రమణ.. ఎలాగూ ఓడే సమయంలోనే తనకు టికెట్ ఇచ్చారని అలక వహించారు. దీంతో ఆయన కూడా ఎక్కడా కనిపించడం లేదు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ.. పరిస్థితి కూడా ఇలానే ఉంది. తనకు ఎంపీ సీటు వద్దు.. పెడన ఇంచార్జ్ కావాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇక, విజయవాడ సెంట్రల్‌లో కేవలం 25 ఓట్లతో ఓడిన బొండా ఉమా.. కొన్నాళ్లు ఊగిస లాడినా.. మళ్లీ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే, ఇది ఎన్నాళ్లనేది కూడా డౌటేనంటున్నారు తమ్ముళ్లు. ఇక, గన్నవరం పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇక్కడ నుంచి గెలిచిన వంశీ బాబుపై తీవ్ర విమర్శలు చేసి వైసీపీకి మద్దతిస్తానని చెప్పారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడలో ఓడిన అవినాష్ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. అసలు అక్కడ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. సో.. మొత్తంగా కృష్ణాలో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి.. అన్నచందంగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ కంచుకోటలో ఎప్పుడూ లేనంత దీనస్థితికి టీడీపీ దిగజారింది.
పామర్రు… టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ పామర్రులో టీడీపీకి ఇంతవరకు ఒక్క విజయం కూడా దక్కలేదు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి డికే దాసు విజయం సాధిస్తే, 2014లో వైసీపీ నుంచి ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ముందువరకు ఉప్పులేటి కల్పన టీడీపీలోనే ఉన్నారు. కానీ అనూహ్యంగా జగన్ చెంతకు చేరి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో ఉప్పులేటి కల్పన మళ్ళీ సొంత గూటికి వెళ్ళిపోయారు. ఇక ఉన్నన్ని రోజులు అధికారం అనుభవించిన ఉప్పులేటి కల్పనని 2019 ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు. టీడీపీ తరపున పోటీ చేసిన ఉప్పులేటి కల్పనపై వైసీపీ అభ్యర్ధి కైలా అనిల్ కుమార్ దాదాపు 31 వేలపైనే మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి ఉప్పులేటి కల్పన పార్టీని గాలికొదిలేశారు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఏవి చేయలేదు.ఇటీవల జిల్లా విస్తృత స్థాయి సమావేశాలకు హాజరయ్యారైన తర్వాత కూడా ఉప్పులేటి కల్పన అంత ఎఫెక్టివ్ గా ఏం పని చేయడం లేదు. దీంతో ఉప్పులేటి కల్పన పట్ల టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గంలో కూడా టీడీపీకి ఇలాంటి పరిస్థితి ఉండటంతో వారు ఉప్పులేటి కల్పన తీరుపై ఫైర్ అవుతున్నారు. ఎలా అయిన ఆమెని తప్పించి వేరే సమర్ధమైన నాయకుడుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు అధినేత చంద్రబాబు కూడా ఉప్పులేటి కల్పన పనితీరుపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల వరకు కాదు కదా.. ఇప్పుడే ఉప్పులేటి కల్పనను మార్చి కొత్త వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పామర్రులో పార్టీ పగ్గాలు స్వీకరించేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. అన్నీ కుదిరితే 2014లో టీడీపీ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సీనియర్ నేత వర్ల రామయ్యకే మళ్ళీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. చూడాలి మరి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో టీడీపీని ఎవరు గట్టెక్కిస్తారో..