బాబు రివ్యూల్లో సేమ్ స్ట్రాటజీ
కడప, నవంబర్ 29,
ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమే. ఒకసారి ఓడిన పార్టీ గెలుపు గు ర్రం ఎక్కడ మనం చూస్తేనే ఉన్నాం. అయితే, ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలు మాత్రం డిఫరెంట్‌గా ఉండాలి. ఎందుకు ఓడిపోయాం. ఎక్కడ ఓడిపోయాం. అని సమీక్షించుకుని ముందుకు సాగాలి. ఈ విషయంలో కార్యకర్తల మనోభావాలకు కూడా నాయకులు విలువ ఇవ్వాలి. అయితే, ఈ తరహా పరిస్థితి టీడీపీలో ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నిజానికి చంద్రబాబు ఓటమిపై సమీక్షలు చేస్తున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నాయకులతో భేటీ అవుతున్నారు. ఓటమిపై సమీక్షలు చేస్తున్నారు.అయితే. ఈ సమయంలోనూ చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిస్థితిపై దృష్టి పెట్టడం లేదనే వాదన పార్టీ దిగువ స్థాయి నాయకుల నుంచి బలంగా వినిపిస్తుండడం గమనార్హం. “మేం చెప్పేది వినిపించుకోవడం లేదు. అసలు పార్టీకి ఓట్లు పడని చోట నాయకుల మాటకు విలువ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబులో మార్పు వచ్చిందని అనుకున్నాం. కానీ, ఆయన ఎక్కడా మారలేదు. తాను చెప్పేదే వినాలనే ధోరణిని ఆయన విడిచి పెట్టలేదు. ఎంత సేపూ.. ఆయన చెప్పేదే మేం వింటున్నాం. పైగా ఆయనలో ధీమా పెరిగింది. ప్రస్తుత జగన్ ప్రభు త్వం చేస్తున్న తప్పుల కారణంగా ప్రజల్లో నైరాశ్యం పెరిగి.. ఇక, తప్పని పరిస్థితిలో తనవైపే మొగ్గుతారని, వచ్చే ఎన్నికల్లో తననే గెలిపిస్తారని చంద్రబాబు అతి విశ్వాసంతో ఉన్నారు“ అని తమ్ముళ్లు పేర్కొంటుండడం గమనార్హం.ఈ తరహా వ్యాఖ్యలు ఒకరో ఇద్దరో చేయడం లేదు. దాదాపు చంద్రబాబు సమీక్షలు చేస్తున్న ప్రతి ప్రాంతం లోనూ ఇదే తరహా వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గెలుపు(రెండు సీట్లు గెలుచుకున్నారు) ఓటములపై చర్చించారు. అయితే, ఈ చర్చలో చంద్రబాబు తన వాదనే వినిపించారు తప్ప.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల వాయిస్‌ను ఆయన వినిపించుకోలేదు. దీంతో తమ్ముళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఎవరికైనా మైక్ ఇచ్చినా.. ఆయా ప్రాంతాల్లో టీడీపీకి పడిన ఓట్లను సరిచూసుకుని, ఎక్కువగా వచ్చిన ప్రాంతాలకు చెందిన వారికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలకే మైక్ ఇచ్చి వారితో రెండు మూడు ముక్కలు మాట్లాడించేసి మమ అనిపించేస్తున్నారు.పార్టీలో సీనియర్ల మాటలకు చంద్రబాబు విలువ ఇవ్వడం లేదని చాలా మంది వాపోతున్నారు. దీనివల్ల పార్టీ ఎలా ముందుకు వెళ్తుందని అంటున్నారు. పైగా చంద్రబాబులో పెరిగిన ధీమా కూడా సరికాదని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున పరిస్థితిని అంతా తనకు అనుకూలంగా ఉంటుందని భావించడాన్ని కూడా తమ్ముళ్లు తప్పు పడుతున్నారు. మరి చంద్రబాబు సమీక్ష పేరుతో తన స్వోత్కర్షకే పరిమితం అవుతారా? లేక తమ్ముళ్లు చెప్పేది ఇకనైనా వింటారా? పార్టీకి జవసత్వాలు ఇస్తారా? లేదా? అన్నది సందేహంగానే ఉంది. ఏదేమైనా అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని డిసైడ్ అయిన చంద్రబాబు తానే ఆప్షన్ అనుకుంటున్నారే తప్పా ఇంత ఘోర పరజయానికి కారణాలేంటన్నది వెతికి సరిదిద్దుకునే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.