వర్మ కేరాఫ్ కాంట్రావర్శీ
హైద్రాబాద్, నవంబర్ 29
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సృష్టించిన మరో ప్రకంపనం ప్రజల ముందు రచ్చ చేస్తోంది. సమాజంలో కుల,మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తూ ప్రజా విశ్వాసాలతో చెలగాటమాడే సినిమాలే అతని ప్రత్యేకత. అదే అతని ప్రచార ముడి సరుకు. పైసా ఖర్చు లేకుండా వర్మ చేసుకుంటున్న ప్రచారానికి మీడియా కూడా సంపూర్ణంగా సహకరిస్తోందనే చెప్పాలి. ఈ దర్శక దిగ్గజం తెలివితేటలు పక్కదారి పడుతున్నాయా? పక్కాగా వాణిజ్య పంథాలో పతనం దిశలో సాగుతున్నాయా? అన్నది సమాజం తేల్చుకోవాలి. ఏదేమైనా రాంగోపాల్ వర్మ చేతిలో రాయిగా మారిన సినిమాలు, అతని పబ్లిసిటీ గిమిక్స్ తో సమాజంపై పడే ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఒన్ టైమ్ వండర్ ..ఈనాటి సోషల్ బ్లండర్ రాంగోపాల్ వర్మ సినిమాల పర్యవసానాలపై అటు సొసైటీతో పాటు న్యాయస్థానాల్లోనూ చర్చించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.చలన చిత్రం కోట్లాది ప్రజలను అలరించే అద్భుతమైన వినోదసాధనం. మనుషుల భావోద్వేగాలను సంతృప్తిపరిచి ఊహల పల్లకిలో ఊరేగించే వర్చువల్ వరల్డ్. అందులోనూ తెలుగు వారు సినిమా ప్రియులు. ఒకానొకప్పుడు దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఏటా సినిమాలు నిర్మించిన రికార్డు సైతం టాలీవుడ్ సొంతం. ఇప్పుడు ఆ రికార్డు కనుమరుగైపోయినప్పటికీ హిందీ తర్వాత స్థానం ఇప్పటికీ మనదే. ఆర్థిక వనరులు, ప్రేక్షకాదరణ రీత్యా టాలీవుడ్ మోత మోగిస్తోంది. ఇదంతా పాజిటివ్ కోణం. మరోవైపు విచ్ఛిన్నకర ధోరణులు, సమాజంలో ఇప్పటికే నెలకొని ఉన్న కుల,మత,ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోసే పోకడలు సినిమా రంగాన్ని పెడదోవ పట్టిస్తున్నాయి. అందులో మొదటి స్థానం రాంగోపాల్ వర్మదే. తాను తీసే సినిమాల ప్రభావం సమాజం పై ఎలా ఉంటుందన్నది ఆయనకు పట్టదు. తానేం చెప్పదలచుకున్నదీ స్పష్టత ఉండదు. తాను తీసి ప్రేక్షకుల మీదకు వదిలే సినిమా పర్యవసానాలపైనా జవాబుదారీతనం లేదు. ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవాలనుకునే తాపత్రయంతో ఇతివ్రుత్తం మొదలు విడుదల వరకూ వివాదాస్పదం చేయడమే వర్మ ఫార్ములా.ఒకానొకప్పుడు రాంగోపాల్ వర్మ పేరు చెబితే యువతరం సంబరాలు చేసుకునేది. శివ సినిమాతో కెరియర్ కు బంగారు బాటలు వేసుకున్నాడు. ఆ సినిమాలోనూ హింస ప్రధానాంశమయినప్పటికీ కళాశాల రాజకీయాలు రియాలిటికీ దగ్గరగా ఉన్నాయని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వర్మ స్రుజనాత్మకతను వేనోళ్ల కొనియాడారు. గాయం.. క్షణ క్షణం వంటి ఆలోచనాత్మక, వినోదాత్మక సినిమాలనూ కాన్వాస్ పై చిత్రకారునిలా తీర్చిదిద్దిన ఘనత వర్మదే. హిందీ చిత్ర సీమలోనూ సర్కారుతో సంచలనమే సృష్టించాడు. అదంతా గతం. క్రియేటివిటీ స్థానంలో కిల్లింగ్ ఇన్ స్టింక్ట్ ప్రవేశించింది. ఏరంగమైతే తనను అందలమెక్కించిందో అదే రంగాన్ని చిన్న చూపు చూడటం మొదలు పెట్టేశారు. ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, దైవభక్తి వంటివాటిని హేళన చేసేందుకు తన ప్రతిభాప్రావీణ్యాలను ప్రయోగించడం ప్రారంభించారు. వివాదాలనే తన పెట్టుబడిగా అదే పెద్ద క్రెడిట్ గా భావిస్తూ సినిమాలు తీస్తూ వాటి చుట్టూ కథలల్లుతూ తన సినిమాలంటేనే వివిధ వర్గాలు అసహ్యించుకునే పరిస్థితిని స్వయంగా వర్మ కల్పించుకున్నారు. అంతటితో సరిపుచ్చుకోకుండా దెయ్యాలు, హింస, ముఠాకక్షలు ముడిసరుకుగా చేసుకొంటూ తీసిన సినిమాలు సరిపోవన్నట్లుగా సెక్స్ ను పతాకస్థాయికి తీసుకెళ్లే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వంటి ఆన్ లైన్ సినిమాలకూ ఆద్యుడిగా నిలిచారు.అంతా నా ఇష్టం అన్నది రాంగోపాల్ వర్మ జీవిత కథే కాదు. అతని ఫిలాసఫీ కూడా. క్రియేటివిటీ కట్టుతప్పింది. రోడ్డున పడింది. అడ్డూ అదుపు లేకపోవడంతో రకరకాల మార్గాల్లో పయనిస్తోంది. ఎవరు దీనిని అదుపు చేయాలంటే ఎవరూ చెప్పలేని స్థితి. ఒకప్పుడు నీరాజనాలు పట్టిన సినిమా పరిశ్రమ ఇప్పుడు వర్మ పేరు చెబితే ఉలికి పడుతోంది. గతంలో ఎంతో సన్నిహితంగా ఉండే హీరోలు సైతం ఆయన ధోరణితో సొంతం చేసుకోలేకపోతున్నారు. అయినా వర్మ మాత్రం డోన్ట్ కేర్. సినిమా రంగం పూర్తి వాణిజ్య ధోరణికే పట్టం గడుతుంది. వర్మ తీసే సినిమాల విలువ, నైతిక పతనం, అవి స్రుష్టించే హింస, సమాజంలో అడ్డుగోడలు వంటి వాటితో టాలీవుడ్ కు సంబంధం లేకుండా పోతోంది. అతను తీసే సినిమాలు ఏదో ఒక వర్గాన్ని అయినా ఆకట్టుకుని సొమ్ములు కురిపిస్తే చాలనేది సినీరంగం అత్యాశ. ఫలితంగా వర్మ సినిమాలు వక్రమార్గం పట్టినా అడిగే వారు లేరు. విడుదలకు అడ్డంకులూ లేవు. నియమాలు, సాంఘిక కట్టుబాట్లు తనకు పట్టవని వర్మే స్వయంగా చెబుతారు. వీలయినంతగా వాటిని తన చిత్రాల్లోనూ అపహాస్యం చేయడానికీ ప్రయత్నిస్తుంటారు.వివాదాల రాంగోపాల్ వర్మకు ప్రచారాస్త్రం మీడియానే. పైసా ఖర్చు లేకుండా తన సినిమాలకు కోట్ల రూపాయల ప్రచారాన్ని తెచ్చుకోవడమెలాగో వర్మకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎలక్ట్రానిక్ మీడియా ఆయన సినిమాలకు కల్పిస్తున్న ప్రచారానికి ఖరీదు కట్టాలంటే కోట్లలో తేలుతుంది. కానీ ఏదో ఒక వివాదం స్రుష్టించి మీడియాను తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటారాయన. టైటిల్ దగ్గర్నుంచి ట్వీట్ల వరకూ తనకు తానే సాటి. ప్రతి విషయం చుట్టూ మీడియాలో చర్చ సాగేలా, ఇంటర్వ్యూల కోసం ఎగబడేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారాయన. పైకి తలతిక్కగా కనిపిస్తుంది కానీ రాంగోపాల్ వర్మది పక్కా ప్లాన్. మీడియాలో ఉండే అపసవ్య పోకడలు, రేటింగ్ జంజాటం, పోటీ తత్వం ఎన్ క్యాష్ చేసుకోవడంలో వర్మ నంబర్ వన్.బెజవాడ రౌడీలంటూ ఒక ప్రాంతాన్ని నేరుగా నిందించినా, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సామాజిక వర్గాలను రోడ్డెక్కించినా అది రాంగోపాల్ వర్మ కే చెల్లు. వివాదం తో ప్రచారం భారీగా సాగిన తర్వాత అశ్వత్థామ హత: అని గట్టిగా చెప్పి కుంజర: అని చెవిలో సణిగినట్లు టైటిల్ మారుస్తుంటారాయన. అప్పటికే కావాల్సిన ప్రచారం, ఆర్థిక ప్రయోజనం సమకూరిపోయి ఉంటాయి. అదే అతని గిమిక్. పబ్లిసిటీ టెక్నిక్. నిజానికి రాయలసీమలో కూడా ఫ్యాక్షన్ అనేది పాత మాటే. మారిన జీవన ప్రమాణాలు, సామాజికంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ప్రజల్లో కూడా చైతన్యం వస్తోంది. దానిని తొక్కిపెట్టి ఇంకా పాత విషయాల పగ నూరి అత్యంత భయానకంగా హత్యలను వెండి తెరపై చిత్రించి పండగ చేసుకోవడం వర్మ వంటి వారికే చెల్లింది. న్యాయస్థానాలు, సెన్సార్ బోర్డులు జోక్యం చేసుకుంటున్న పరిస్థితుల్లో తప్ప సమాజం అంటే భయం పోయింది. ఇతర వర్గాల ఉదాసీనత, నిర్లిప్తతల కారణంగా సమాజంలో నిలదీసి ప్రశ్నించే స్వరాలూ నీరసపడిపోతున్నాయి. నీరుగారిపోతున్నాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఏదేని పతాక స్థాయికి చేరిన తర్వాతనే అడ్డుకట్ట పడుతుంది. అదెప్పుడన్నది కాలం, సంఘం చెప్పాల్సిన సమాధానం. అంతవరకూ వర్మ చేతిలో రాళ్లు సమాజంపై పడుతూనే ఉంటాయి. వికటాట్టహాసం చేస్తూ వాటిని ఆయన విసురుతూనే ఉంటారు.