Highlights
- 22న ప్రారంభించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ), స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నైపుణ్యరథాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు సమచారాన్ని ఉద్యోగార్థులకు అందచే సేందుకు నైపుణ్య రథాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఒక నైపుణ్యరథం గుంటూరు, విజయవాడ పరిసరప్రాంతాల్లో నిరుద్యోగులు, ఉపాధి కల్పించే కంపెనీల మధ్య అనుసంధానంగా పని చేస్తోందని తెలిపారు. మరో నైపుణ్య రథాన్నిఈనెల 22న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. వివిధ కంపెనీలు, పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాల సమాచారాన్ని సేకరించి నిరుద్యోగ యువతకు అందించడమే దీని లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు దీని కోసమే ప్రత్యేకంగా సిద్దం చేసిన 'ఆప్లీ' యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వారి అర్హతకు సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేసుకోవాలని చెప్పారు. ఆ తర్వాత వారి అర్హతలను అనుపరించి వారు నమోదు చేసుకున్న ఈ-మెయిల్ కు ఎప్పటికప్పుడు ఉద్యోగాల సమాచారం పంపుతారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800 425 2422లో తమను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆప్లీ యాప్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 1700 కంపెనీలతో నైపుణ్యరథం అనుసంధానం అయి ఉందని ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో కె.సాంబశివరావు చెప్పారు.