మూడు దశల్లో స్థానిక ఎన్నికలు
విజయవాడ, నవంబర్ 29
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీటిని వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికలకు జనవరి రెండో వారంలో షెడ్యూల్ వెలువడుతుందని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా మంత్రులకు కర్తవ్యబోధ చేశారు. కాగా, తొలిదశలో పంచాయతీ, రెండోదశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మూడోదశలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అన్ని ఎన్నికలను కలిపి రెండుదశల్లో నిర్వహించాలని తొలుత భావించినా హైకోర్టు ఆదేశాలతో ముందుగా పంచాయతీ ఎన్నికలకు ప్రాధాన్యతనిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తిచేసేలా ఎన్నికల కమిషన్ కార్యాచరణను సిద్ధం చేస్తోంది.పంచాయతీల కాలపరిమితి 2018 ఆగస్టు 1తో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీన్ని సవాల్ చేస్తూ కొందరు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. 2018 అక్టోబరు నుంచి మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మరోసారి ఈ విషయం హైకోర్టుకు చేరింది. దీంతో మార్చిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జనవరిలోగా ఈసీకి ప్రభుత్వం లేఖ రాస్తే, మార్చిలోగా ప్రక్రియను పూర్తిచేసే వీలుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినందున ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమని ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొంటున్నారు.హైకోర్టులో దాఖలుచేసి అఫిడవిట్ ప్రకారం మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఒకే నెలలో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నందున పోలీసు, అధికారుల సేవలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం పంచాయతీలను మూడుగా విభజిస్తారు.పంచాయతీల వారీగా 2019 మే 20న ప్రచురించిన ఓటర్ల జాబితాలనే స్థానిక ఎన్నికలకు ప్రతిపాదికగా తీసుకోనున్నారు. ఏటా ఫిబ్రవరి 7న సవరించిన ఓటర్ల తుది జాబితాలను ఈసీ ప్రకటిస్తుంటుంది. జనవరిలోగా రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో కొత్త ఓటర్ల జాబితా అవసరం ఉండదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. మార్చిలోగా ఎన్నికల నిర్వహణకు రెండు నెలల ముందే నోటిఫికేషన్ వెలువరిస్తారు కాబట్టి.. సవరణ ఓటర్ల అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు