భాగ్యనగర్ లోనే మెటర్నల్ డెత్స్...
హైద్రాబాద్, నవంబర్ 30,
మెటర్నల్స్ మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 334 మంది చనిపోగా, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 7 నెలల్లోనే 322 మంది చనిపోయారు. ఒక్క అక్టోబర్లోనే 62 మంది చనిపోగా, సెప్టెంబర్లో 48 మంది మరణించారు. రెండేండ్లుగా రాష్ట్రంలో ఈ మరణాలు పెరుగుతున్నాయి. 2017–18లో 306 మంది, 2018–19లో 407 మంది చనిపోయారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా 3.41 లక్షల జననాలు నమోదవగా, ప్రతి లక్ష డెలివరీలకు సుమారు 98 మంది గర్భిణులు, బాలింతలు చనిపోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2016–17 రాష్ట్రంలో ఆ మరణాల రేటు 76 ఉండగా, ఇప్పుడు 98కి పెరిగింది.ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి హైబీపీ ఉంటుంది. దాన్నే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్హైపర్టెన్షన్ (పీఐహెచ్) అంటారు. చాలా మంది మరణాలకు ఈ పీఐహెచ్ కారణమవుతోంది. ఈ ఏడాది చనిపోయిన వారిలో 81 మంది ఈ పీఐహెచ్ వల్లే చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 20 ఏండ్ల లోపు, 40 ఏండ్లకుపైబడిన వాళ్లు గర్భం దాలిస్తే పీఐహెచ్ సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కవలలు, పోషకాహారలోపం, షుగర్ వంటివీ దీనికి కారణమవుతాయని అంటున్నారు. పీఐహెచ్ తర్వాత గర్భిణులు, బాలింతల మరణాలకు మరో అతిపెద్ద కారణం పోస్ట్పార్టమ్ హీమరేజ్ (పీపీహెచ్: డెలివరీకి ముందు, తర్వాత ఎక్కువ రక్తం పోవడం). ఈ ఏడాది 55 మంది ఈ కారణంతోనే చనిపోయారు. రక్తహీనతతో మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గుండె జబ్బులూ వారి ప్రాణాలను తీస్తున్నాయి. ఈ ఏడాది చనిపోయిన వాళ్లలో 62 మంది మృతికి అదే కారణం. అందులోనూ 22 మంది పోస్ట్పార్టమ్ కార్డియోమయోపతి వల్ల కన్నుమూశారు. ప్రెగ్నెన్సీ చివరి నెలలో, డెలివరీ తర్వాత 5 నెలలోపు గర్భిణులకు ఈ గుండెజబ్బు ముప్పు ఉంటుంది. జెనెటికల్, లైఫ్స్టైల్ అందుకు కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఎంబోలిజం (రక్త నాళాల్లోకి గాలి వెళ్లడం) తదితర కారణాలతోనూ గర్భిణులు, బాలింతలు ప్రాణాలు కోల్పోతున్నారు.మాతాశిశు సంరక్షణ కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాయి. పోషకాహార పంపిణీ, హెల్త్చెకప్లు, ప్రోత్సాహకాలు, కేసీఆర్ కిట్ల వంటి పథకాలతో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంత చేస్తున్నా మరణాలు పెరుగుతున్నాయి. రిస్క్ ఎక్కువున్న గర్భిణులను గుర్తించి ప్రత్యేక చొరవ తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గర్భిణులను దవాఖాన్లకు తీసుకొచ్చేందుకు 102 వాహనాలు నడిపిస్తున్నారు. అయినా, ఆస్పత్రికి చేర్చేలోపే 39 మంది గర్భిణులు చనిపోయారు. మరో 39 మంది రకరకాల కారణాలతో ఇంటి వద్దే కన్నుమూశారు.మామూలుగా అయితే ఏజెన్సీ ఏరియాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే బాలింతలు, గర్భిణుల మరణాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. దానికి కారణం, ఆయా చోట్ల సరైన వసతులు లేకపోవడమే. అయితే, రెండేండ్లుగా అన్ని వసతులూ ఉన్న హైదరాబాద్ జిల్లాలోనే గర్భిణులు, బాలింతల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2018–19లో 34, ఈ ఏడాది 33 మంది చనిపోయారు. వికారాబాద్ (19), రంగారెడ్డి (18), సంగారెడ్డి (18) జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి