YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో త్యాగయ్యలకు పదవులు

 ఏపీలో త్యాగయ్యలకు పదవులు

 ఏపీలో త్యాగయ్యలకు పదవులు
విజయవాడ, నవంబర్ 30
ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటోంది. ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయ‌కుల‌కు మంచి గుర్తింపు ఇవ్వాల‌ని పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తాజాగా నిర్ణయించిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. వీరిలో రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌, కౌరు శ్రీనివాస్‌ ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరు పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం చేసిన కృషితో పాటు త‌మ సీట్లను కూడా త్యాగం చేసిన నేప‌థ్యంలో జ‌గ‌న్ వీరికి మంచి గుర్తింపు ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నారు. రావి విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న గుంటూరుకు చెందిన కీల‌క‌నాయ‌కుడు. కాంగ్రెస్‌లో ఉండ‌గా దివంగ‌త వైఎస్సార్ ఆశీస్సుల‌తో ప్రత్తిపాడు నుంచి గెలిచి, మాకినేని పెదర‌త్తయ్య‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.ఇక‌, 2014లో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రావి.. అప్పట్లో పొన్నూరు నుంచి పోటీ చేశారు. అయితే, ఇక్కడ బ‌ల‌మైన నాయ‌కుడు ధూళిపాళ్లపై ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. అయినా కూడా పార్టీని ముందుకు న‌డిపించారు పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఇక్కడ ఆయ‌న చ‌క్రం తిప్పారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనే నిశ్చయంతో ఆయ‌న ముందుకు సాగారు. ఈ క్రమంలోనే అహ‌ర‌హం శ్రమించారు. అయితే, ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు ఇక్కడ జ‌గ‌న్ ఈయ‌న టికెట్‌ను పార్టీలోని కీలక నాయ‌కుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు అల్లుడు కిలారు రోశ‌య్యకు కేటాయించారు.అయినా కూడా రావి వేసిన పునాది కిలారు గెలుపున‌కు ఎంతైనా ఉప‌యోగ‌ప‌డింది. జ‌గ‌న్ సీటు ఇవ్వక‌పోయినా రావి మాత్రం కిమ్మన‌లేదు. వైసీపీ విజయానికి తన వంతు శ్రమించారు. ఈయ‌న చేసిన త్యాగాన్ని గుర్తుంచుకున్న జ‌గ‌న్‌.. రావికి ఇప్పుడు గుంటూరు జిల్లా ప‌రిష‌త్ చైర్మన్ ప‌ద‌విని ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. సంక్రాంతి త‌ర్వాత జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రావికే జ‌డ్పీచైర్మన్ పీఠం ఇస్తార‌న్న వార్తలు గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ కౌరు శ్రీనివాస్ కూడా పార్టీ కోసం ఎంతో శ్రమించారు. ఆచంట‌లో పార్టీని ముందుకు న‌డిపించారు. యువ‌త‌ను చేర‌దీశారు. పార్టీ కోసం సైన్యాన్ని త‌యారు చేశారు. అయితే, ఎన్నికల‌కు ముందు ఇక్కడ జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లో భాగంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ‌నాధ‌రాజుకు జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. అయినా కూడా కౌరు మ‌న‌స్తాపానికి గురి కాకుండా రంగ‌నాథ‌రాజు విజ‌యం కోసం కృషి చేశారు. ఆయ‌న విజ‌యం త‌ర్వాత కౌరును పాల‌కొల్లుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన జ‌గ‌న్ అక్కడి బాధ్యత‌ల‌ను అప్పగించారు. అక్క‌డ కూడా కౌరు దూకుడు చూపిస్తున్నారు.పాల‌కొల్లులో ప్రస్తుతం టీడీపీకి చెందిన నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడించాల‌ని కౌరుకు జ‌గ‌న్ ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే కౌరు అప్పటి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌ప‌డేందుకు ఓ ప‌ద‌వి క‌ట్టబెట్టాల‌ని జ‌గ‌న్‌ నిర్ణయించుకున్నారు. ఈయ‌న‌కు డీసీసీబీ చైర్మన్ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు వైసీపీ వ‌ర్గాల్లో వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నట్టు స‌మాచారం. మొత్తంగా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి జ‌గ‌న్ మంచి గుర్తింపు ఇస్తున్నార‌నే ప్రచారం వైసీపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది.

Related Posts