మమతకు పెరిగిన కాన్ఫిడెన్స్
బెంగాల్, నవంబర్ 30
ఫశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అసెంబ్లీ ఎన్నికల వేళ అనుకోని అదృష్టం వరించింది. ఆ అదృష్టం అలాంటి ఇలాంటిది కాదు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మమత బెనర్జీ మాత్రమే కాదు క్యాడర్ లోనూ ఊపు తెచ్చే అదృష్టం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల్లో మమత బెనర్జీ పార్టీ విజయకేతనాన్ని ఎగురవేసింది.లోక్ సభ ఎన్నికల్లో మమత బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఊహించని విధంగా పుంజుకోవడంతో మమత బెనర్జీ ఒకింత ఆందోళనకు గురయ్యారు. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలను కాదని బీజేపీ వైపు బెంగాలీలు చూస్తున్నారన్న అనుమానం కూడా లేకపోలేదు. గత రెండు సార్లు వరసగా ఎన్నికవుతూ వస్తున్న మమత బెనర్జీ ప్రభుత్వంపై ఉన్న సహజంగా పెల్లుబికే వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంటుందని విశ్లేషకులు సయితం భావించారు.దీంతో మమత బెనర్జీ గత మూడు నెలల నుంచి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం సలహాలు, సూచనలతో మమత బెనర్జీ ఎన్నికలకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. తాజాగా జరిగిన కాలియాగంజ్, ఖరగ్ పూర్ సదర్, కరీంపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఒక్క కాలియాగంజ్ మినహా మిగిలిన రెండు స్థానాల్లో భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో మమత బెనర్జీలో ధీమా పెరిగింది.మమత బెనర్జీ గత కొన్ని నెలలుగా బీజేపీ చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కినట్లయిందంటున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్సీ విషయంలో మమత బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ఆర్సీ ప్రభావం కూడా ఉప ఎన్నికలపై పడిందని చెబుతున్నారు. ముస్లిం ఓటు బ్యాంకు చీలకుండా ఎన్ఆర్సీ ఉపయోగపడిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మోదీ, అమిత్ షా ప్రభావం మసక బారుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అన్న ఆత్వవిశ్వాసాన్ని మమత బెనర్జీలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు రెట్టింపు చేశాయనే చెప్పాలి