YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జార్ఖండ్ లో ఆశభంగం తప్పదా

జార్ఖండ్ లో ఆశభంగం తప్పదా

జార్ఖండ్ లో ఆశభంగం తప్పదా
పాట్నా, నవంబర్ 30
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 81 స్థానాలు గల ఈ చిన్న రాష్ట్రంలో  అయిదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. గిరిజనుల ఆధిక్యం గల రాష్ట్రంలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆర్నెల్ల క్రితం జరిగిన లోకన్ సభ ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కదం తొక్కాలి. దానికి గెలుపు నల్లేరుపై నడక కావాలి. అదే సమయంలో విపక్షాలు మొక్కుబడిగా ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. ఏప్రిల్ , మే నెలల్లో మొత్తం 14 లోక్ సభ స్థానాలకు గాను11 స్థానాలను కైవసం చేసుకుంది. దాని మిత్రపక్షమైన ఏ.జే.ఎస్.యూ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్) ఒక స్థానంతో గెలుపొందింది. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా) చెరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.ఈ ప్రాతిపదికన చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి ఎదురే ఉండకూడదు. అదే సమయంలో విపక్షాలకు ఉనికే ఉండకూడదు. కానీ పరిస్థితులు మారాయి. మహారాష్ట్ర, హర్యానాలో మెజారిటీకి కొద్దిదూరంలో ఆగిపోయిన కమలం పార్టీకి రేపటి జార్ఖండ్ తీర్పు ఎలా ఉండబోతుందన్న భయం లోలోన నెలకొంది. హర్యానాలో దుష్యంత్ చౌతాలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కీలకమైన మహారాష్ట్రలో తలబొప్పి కట్టింది. మిత్రపక్షమైన శివసేనతో కలసి అధికారం సాగించేందుకు అవసరమైన సంఖ్యాబలం పొందినప్పటికీ శివసేన ఎదురు తిరగడంతో ఖంగు తినింది. మూడు దశాబ్దాల మైత్రిని కాదనుకున్న శివసేన సైద్ధాంతిక వైరుద్ధ్యం గల ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలసి సర్కార్ ను ఏర్పాటు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో మోడీ గాలి బలంగా వీచినప్పటికీ ఆయన అజేయుడేమీ కాదని, పార్టీకి తిరుగులేదనుకోవడం భ్రమేనని మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలు నిరూపించాయి. దీంతో కమలం పార్టీ గతంలో మాదిరిగా ఆర్భాటపు ప్రకటనలకు దూరంగా ఉంది. గెలుపుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోగ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హిందువులు ఆధిక్యంగల మహారాష్ట్రలో 370 అధికరణ రద్దు వంటి అంశాలు ఏమాత్రం పనిచేయలేదు. మోదీ గాలి వీయనే లేదు. ఇప్పుడు కూడా అయోధ్యపై సుప్రీం తీర్పు, గిరిజనులు ఆధిక్యంగల జార్ఖండ్ లో ఎంత మాత్రం పనిచేయదని విశ్లేషకుల అంచనా.నిజానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అద్భుత పనితీరును ప్రదర్శించలేదు. సొంతంగా 37 స్థానాలు గెలుచుకోగా, మిత్రపక్షమైన ఏ.జె.ఎస్.యు అయిదు స్థానాలతో రఘుబర్ దాస్ ప్రభుత్వం అయిదేళ్ల పాటు పాలించింది. ఈ దఫా 61 స్థానాలు సాధన లక్ష్యంగా బరిలోకి దిగుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఏమాత్రం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కూటమిలో విభేదాలు కాషాయ పార్టీకి తలనొప్పిగా మారాయి. సీట్ల పంపకంలో తేడాలు రావడంతో రామ్ విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జన శక్తి పార్టీ 50 స్థానాల్లో సొంతంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్రకటన చేశారు. ఈయన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. 2014లో ఎల్జేపీ ఒకే ఒక్క స్థానంలో పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి 6 స్థానాలను కావాలని పట్టుబట్టడంతో బీజేపీ తిరస్కరించింది. మరో కీలక మిత్రపక్షమైన ఏ.జె.ఎస్.యూ గత ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసి అయిదు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఏ.జే.ఎస్.యు 19 స్థానాలను కోరగా 9కి మించి ఇవ్వమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా బరిలో ఉన్నా చక్రధర్ పుట్ తో సహా మొత్తం 12 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించుతామని ప్రకటించడంతో బీజేపీ చర్చలకు అంగీకరించింది. ఇదిలా ఉండగా బీజేపీ 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ జంషెడ్ పూర్ (తూర్పు) నుంచి బరిలోకి దిగుతున్నారు.నవంబరు 30, డిసెంబరు 7, 12, 16 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విపక్ష జేఎంఎం, కాంగ్రెస్ లు ఇప్పుడే కదన రంగంలోకి దిగాయి. గత ఎన్నికల్లో 19 స్థానాలను సాధించిన జేఎంఎం, 8 స్థానాలు సాధించిన జార్ఖండ్ వికాస్ మోర్చా, ఆరు స్థానాలను సాధించిన కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ వైఫల్యాలను సానుకూలంగా మలచుకునే పరిస్థితిలో ఈ కూటమి లేదు. జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, పీసీీసీ చీఫ్ రామేశ్వర్ బరాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ఠాకూర్ సమన్వయంతో పనిచేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జి ఆర్పీఎన్ సింగ్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోని లుకలుకలు విజయావకాశాలను ప్రభావితం చేస్తాయన్న భయం కమలం పార్టీలో ఉంది. అదే సమయంలో విపక్ష కూటమి గట్టి ప్రయత్నం చేస్తే కమలాన్ని నిలువరించడం అంత కష్టమేమీ కాదు

Related Posts