Highlights
- తెలుగును సబ్జెక్టుగా బోధన
- వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
- అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా ఒక సబ్జెక్టుగా బోధించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశించారు. మాతృభాష అయిన తెలుగును రక్షించుకోవడం, మన సంస్కృతిని కాపాడుకోవడం లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో తెలుగును సబ్జెక్టుగా బోధించాలన్నారు. మాతృభాష బోధన అమలుకు సంబంధించి తమిళనాడులోని విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌వీ సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీలో తెలుగు పాఠ్య పుస్తకాల సమన్వయకర్త సువర్ణ వినాయక్ లు పాల్గొన్న ఈ సమావేశంలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాల గురించి చర్చించారు. ఈ విధానం అమలుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్టు వెల్లడించారు. అదే క్రమంలో తెలుగు కనుమరుగు కావొద్దు. అందుకే ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన విధిస్తున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
భాషను కాపాడుకోవడంతోపాటు, మాతృభాష ద్వారా జీవితంలో ఉపయోగపడే విషయాలను విద్యార్థులకు బోధించాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంచే అంశాలుండాలని వివరించారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండడం కోసం అసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఒక తెలుగు పండిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అన్నిటిలో తెలుగు బోధన అమలు దిశగా చర్యలు చేపట్టారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంలో చదువడం అందరికీ అనివార్యమవుతున్నది. పిల్లల భవిష్యత్తును కూడా దెబ్బతీయవద్దు. అదేక్రమంలో తెలుగు కనుమరుగు కావద్దు. అందుకే ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగుభాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నాం.తెలుగుభాష తప్పనిసరి అమలుపై కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అమ్మభాషకు పట్టం కట్టేందుకు నడుంబిగించారు. ఈ క్రమంలో మొదట ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించాం. అయితే ఇంటర్మీడియట్ (10+2) బోధనా విధానం అన్ని విద్యాసంస్థల్లో ఒకే మాదిరిగా లేదు. ఇంటర్మీడియట్‌లో తెలుగును అమలుచేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. అయినా మొదటిదశలో పదో తరగతి వరకు తెలంగాణలో తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తరగతులవారీగా తెలుగులో బోధించాల్సిన అంశాలకు సంబంధించి సిలబస్ రూపొందించాల్సిందిగా తెలుగు యూనివర్సిటీ, సాహిత్య అకాడమీలను కోరారు.
తెలుగు వర్సిటీ, సాహిత్య అకాడమీలకు పాఠ్య ప్రణాళిక బాధ్యత.
తరగతుల వారీగా తెలుగు పాఠ్య ప్రణాళికను రూపొందించాల్సిందిగా తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. భాషను కాపాడుకోవడంతోపాటు మాతృభాష ద్వారా జీవితంలో ఉపయోగపడే విషయాలను విద్యార్థులకు బోధించాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంచే అంశాలు ఉండాలని వివరించారు. తెలుగు చదివే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉండేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో కూడా తప్పనిసరిగా ఒక తెలుగు పండిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సీఎం ఆదేశించారు.
ఒకటో తరగతి నుంచి మొదలు..
తెలుగు తప్పనిసరి సబ్జెక్టు ప్రక్రియ దశల వారీగా అమలు కానుంది. వచ్చే విద్యా సంవత్సరంలో మొదట ఒకటో తరగతితో ప్రారంభమవుతుంది. కన్నడ, తమిళం, మరాఠీ తదితర పాఠశాలల్లోనూ మొదటి తరగతి చదివే వారికి తెలుగు సబ్జెక్టు ఉంటుంది. సీబీఎస్‌ఈ వంటి ఇతర బోర్డుల బడుల్లోనూ ఒకటో తరగతి నుంచే తెలుగు మొదలువుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంసెట్‌లో ర్యాంకింగ్‌కు ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఎంతోమంది తెలుగేతర విద్యార్థులు హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతుండటం, ఇప్పటికే సంస్కృతం, హిందీ అధ్యాపకుల ఆందోళనలు వంటి పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో 10వ తరగతి వరకు మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. దశల వారీగా అమలు చేస్తామనడం వల్ల ఇంటర్మీడియేట్ లో అమలు ఉండక పోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయం హర్షణీయం..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరిగా ఒక బోధనాంశంగా ఉండాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మాతృభాష అమలుపై రూపొందించిన చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ పదో తరగతి వరకే తప్పనిసరి తెలుగును అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
.