వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుపతి నవంబర్ 30
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఉదయం 7.55 గంటలకు వృశ్చిక లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. శరీరం - రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి - సారథి, మనస్సు - పగ్గాలు, ఇంద్రియాలు - గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12.30 నుండి 2 గంటల వరకు రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. అశ్వవాహనంపై లోకరక్షణి ఎనిమిదో రోజు రాత్రి 7.30 నుండి 11 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు విహరించనున్నారు. అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది. రథోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో పి.బసంత్‌కుమార్, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఇలు రాములు, రమేష్‌రెడ్డి, వేంకటేశ్వర్లు, విఎస్వో ప్రభాకర్, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ సలహాదారు కాండూరి శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, ఏవిఎస్వో నందీశ్వర్‌రావు, సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ కోలా శ్రీనివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.