యువతులకు భరోసా ఇస్తున్న పోలీసులు
మహబూబ్ నగర్ నవంబర్ 30
మహాబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలను పోలీసు అధికారులు సందర్శించారు. అమ్మాయిలకు ఎల్లవేళలా మీ పోలీసు అండగా ఉంటుందని, తమను పోలీసు మేనమామలుగా భావించి నిర్భయంగా మీ సమస్యలు చెప్పుకోవాలని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులపై ప్రేమ, చదువుపై శ్రద్ధ, క్రమశిక్షణతో ఎదగాలని అమ్మాయిలను ఎవరైనా వేధిస్తుంటే ఏమైనా ప్రమాదకర పరిస్థితులు వున్నాయని భయం అనిపిస్తే తక్షణమే ఏరాత్రి అయినా నమ్మకంతో మీ పోలీసుకు సంబంధించిన డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, దుర్మార్గపు పనులు చేసి అమ్మాయిలను ఇబ్బంది పెట్టే మూర్ఖుల పని పట్టడం మీ పోలీసు మేనమామల బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. అమ్మాయిలు బేలగా, భయపడుతూ ఉండరాదని అవసరమైనప్పుడు గర్జించాలని, ఎల్లప్పుడూ సమాజం మీకు తోడుగా ఉంటుందని వివరించారు. అదే సందర్భంలో మీ సమస్యలను, భయాన్ని, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేవారి వివరాలను దయచేసి మీ పోలీసు డయల్ 100 నెంబర్ కు తెలుపాలని పోలీసు అధికారులు కోరారు. ప్రయాణాలు చేసేటప్పుడు, రోడ్లపై వెళ్ళేటప్పుడు ఎవరైనా వెకిలిగా ప్రవర్తిస్తే, తోటి మహిళలకు, అక్కడ ఉండే పెద్దలకు తెలుపాలని, మనం మౌనంగా ఉంటే మూర్ఖులు మరింతగా రెచ్చిపోతారని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన షీ పోలీసు మొబైల్ నెంబర్ కు కూడా అమ్మాయిలు తమ సమస్యలు చెప్పుకోవచ్చని, షీ పోలీసు నెంబర్ 9440713000 ను గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సరే అమ్మాయిలు, మహిళలు, పిల్లలు, పౌరులకు అసాంఘీక వ్యక్తుల వలన సమస్యలు ఏర్పడితే డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేయడం వలన సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే మీకు సహాయంగా వస్తారని, దయచేసి మౌనాన్ని, భయాన్ని వీడి మీ పోలీసులకు సహకరించాలని తెలిపారు. మనమంతా కలిసి దుర్మార్గుల పని పడదామని ఆయా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులతో మాట్లాడుతూ పోలీసు అధికారులు పేర్కొన్నారు.