మహాబలపరీక్షలో ఉద్ధవ్ విజయం
బలపరీక్ష కు ముందే బీజేపీ వాకౌట్
ముంబై, నవంబర్ 30,
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన తొలి పరీక్షలో విజయవంతమయ్యారు. బలపరీక్షకు ముందే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండానే ప్రొటెం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఉద్ధవ్ 169 ఓట్లతో గెలుపొందారు. అంతకు ముందు విశ్వాస పరీక్షను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చవాన్ తీర్మానం ప్రతిపాదించగా, తర్వాత ఎన్‌సీపీ ఎమ్మెల్యే నవాబ్ మాలిక్, శివసేన ఎమ్మెల్యే సునిల్ చదివి వినిపించారు. విశ్వాసపరీక్షలో నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రమాణస్వీకారం సందర్భంగా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పేరును ప్రస్తావించడం నేరమా? అని ప్రశ్నించారు. అనంతరం సభను ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం స్పీకర్ ఎన్నికతోపాటు ఉభయసభులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.కాగా, అసెంబ్లీ నిబంధనలను మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఉల్లంఘించిందని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. అంతేకాదు, బలపరీక్ష కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశ పరచడంపై ఫడ్నవీస్ ఆరోపణలు గుప్పించారు. వందేమాతరం గేయం ఆలపించకుండా సభను ప్రారంభించడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన దుయ్యబట్టారు. ఫడ్నవీస్ వ్యాఖ్యలను ప్రొటెం స్పీకర్ దిలీప్ పాటిల్ ఖండించారు. ఈ సమావేశం నిర్వహించడానికి గవర్నర్ అనుమతించారని, ఎక్కడా ఉల్లంఘనకు పాల్పడలేదని ఆయన బదులిచ్చారు. అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.దీనిపై కూడా ఫడ్నవీస్ అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్యాంగ నిబంధనలు ప్రకారం జరగలేదని అన్నారు. దీనిపై స్పందించిన ప్రొటెం స్పీకర్.. ఇది అసెంబ్లీ మాట్లాడాల్సిన అంశం కాదని తెలిపారు. దీంతో ఒకవేళ రాజ్యాంగం గురించి మాట్లాడానికి తనకు అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీలో కూర్చునే అర్హత కూడా తనకు లేదని అన్నారు. స్పీకర్‌ను ఎన్నికోకుండా బలపరీక్ష నిర్వహించడం మహారాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు.. మీకెందుకు అంత భయమని? ప్రశ్నించారు.