YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నిధులు నీళ్ల పాలు (కర్నూలు)

నిధులు నీళ్ల పాలు (కర్నూలు)

నిధులు నీళ్ల పాలు (కర్నూలు)
కర్నూలు, నవంబర్ 30  కర్నూలు నగరంలో నీళ్ల నిధులు క్షేత్రస్థాయిలో మింగేస్తున్నారు.. పర్యవేక్షకులే అనధికారికంగా కనెక్షన్లు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి జేబులు నింపుకొంటున్నారు. ఫిర్యాదులు వెళ్లినా ప్రశ్నించకుండా ఉండేందుకు పైఅధికారులను పాల ప్యాకెట్లు, రీఛార్జులు, గ్యాస్‌ సరఫరా చేస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. నిజమైన లబ్ధిదారులకు నీళ్ల కనెక్షన్లు ఇవ్వకుండా తిప్పుకొంటున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రకాశ్‌నగర్‌లో రెండు, నెహ్రూ నగర్‌లో ఒకటి మొత్తం మూడు వాణిజ్య భవనాలకు ఎలాంటి మీటరు బిగించకుండానే కార్పొరేషన్‌ నీటి పైపులైను వేసి నీళ్లందిస్తున్నారు. ఇవిగాక మరో ఏడు ఆసుపత్రులు, అపార్ట్‌మెంట్లకు ఇదే పరిస్థితి. ఇది ఒక ట్యాప్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో జరిగిన తంతు. ఒక్కో అనధికార కనెక్షన్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ తంతు అంతా పైఅధికారులకు తెలిసే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి మల్లికార్జునను వివరణ కోరగా.... వాణిజ్య భవనాలకు నీటి మీటర్ల సమాచారం తమ దగ్గర ఏమీ ఉండదని, ఎస్‌ఈ సురేంద్రబాబును అడిగితే సమాచారం తెలుస్తుందని తప్పించుకున్నారు. నీటి కుళాయి కనెక్షన్లకు లబ్ధిదారుడు అధికారికంగా చెల్లించాల్సినవి చెల్లించినా క్షేత్రస్థాయిలో కాసులివ్వకుంటే కాలయాపన చేస్తున్నారు. రూ.వేలల్లో సమర్పిస్తేనే కనెక్షన్లు ఇస్తున్నారు. ఇక వాణిజ్య భవనాలకైతే కాసులు దండిగా రావడంతో అనధికారికంగా పైపులు వేసి నీళ్లు అందిస్తున్నారు. పైపులైను వేసేముందే రూ.50 వేల వరకు వసూలు చేసి పంపకాలు చేసుకుంటున్నారు. అందిస్తున్న నీటికి తగ్గ పన్ను జీఐఎస్‌ సర్వేలో సైతం అత్యధికంగా కర్నూలు నగరంలో 19 వేల బోగస్‌ కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. అయినా బాధ్యులపై చర్యలు లేకపోవడంతో నీటి విభాగం అధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పర్యవేక్షకుల వరకు భయం లేకుండా వసూళ్ల దందా చేస్తున్నారు. ఇలా అనధికార కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో ఏటా సరఫరా చేస్తున్న నీటికి తగ్గ పన్ను జమకాక ఖజానాకు రూ.లక్షల్లో గండి పడుతోంది. నగరంలోని పాత బస్టాండ్‌లో గతంలో పనిచేసిన సమయంలో ఓ ట్యాప్‌ ఇన్‌స్పెక్టర్‌ దందాపై ఫిర్యాదులు అందగా అతన్ని సస్పెండ్‌ చేయాలని స్థానిక ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ ప్రస్తుతం అశోక్‌ నగర్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా మీటర్లు లేకుండా వాణిజ్య భవనాలకు కనెక్షన్లు ఇస్తున్నారన్న అభియోగాలు వస్తున్నాయి. నగరంలో తొమ్మిది మంది ట్యాప్‌ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఆరుగురే పనిచేస్తున్నారు. వీరు ఇష్టారాజ్యంగా పైపులైన్లు వేస్తూ ప్రభుత్వ నిధులు వృథా చేస్తున్నారు. పూలబజార్‌ చిన్నమ్మవారిశాల నుంచి బండ్లమెట్ట వరకు అమృత్‌ పథకం కింద అవసరం లేకున్నా పైపులైను వేయించారు. కొన్ని రోజుల క్రితం సీతారామ్‌ నగర్‌, ఇందిరా నగర్‌లో ఓ అధికారి తనకు ఇష్టమొచ్చినట్లు పైపులైను మార్చేశారు. ఫలితంగా పదిరోజులు నీటి సరఫరా నిలిచిపోయింది. నలభై ఏళ్ల నుంచి ఎలాంటి నీళ్ల ఇబ్బంది లేకుండా ఉంటే ఎందుకు కొత్త లైను అని స్థానికులు ప్రశ్నిస్తే అప్పుడు పాత పైపులైనుకు కనెక్షన్‌ ఇచ్చి సమస్య లేకుండా చేశారు.

Related Posts