ముంచేస్తున్న సోమశిల (కడప)
కడప, నవంబర్ 30 : ఆకుపచ్చని పంటలను సోమశిల వెనుక జలాలు ముంచేశాయి. అన్నదాతలకు కనీసం సాగు పెట్టుబడి దక్కలేదు. రైతులను నమ్ముకొని జీవనం సాగించే నీరుకట్టు కూలీల ఆశలు కూడా నీటిలో మునిగిపోయాయి. ధాన్యం చేజారిపోయింది. కనీసం తిండి గింజలు ఇంటికి చేరలేదు. నెలల తరబడి శ్రమిస్తే నోటికాడ ముద్ద అందకుండా నీటిపాలైంది. ఏం తినాలి, ఎలా బతకాలి అని ఆ శ్రమజీవులు వాపోతున్నారు. ఒంటిమిట్ట మండలం పెన్నానది పరివాహక గ్రామాల్లో ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట సోమశిల నీటిలో మునిగింది. పెన్నపేరూరు, తప్పెటవారిపలె, వెంకటాయపల్లె, గంగపేరూరు, ఇబ్రహీంపేట, చిన్నకొత్తపల్లి, రాచగుడిపల్లె, నరసన్నగారిపల్లెలో రైతులు వేసిన సుమారు వెయ్యి ఎకరాల్లో ముంపులో చేరింది. సుమారు రెండు నెలల పాటు నీరు నిల్వ ఉండటంతో చేతికి దక్కాల్సిన పైరు కుళ్లిపోయింది. వెన్నులు, కంకులు తడిసి మొలక వచ్చాయి. ఎక్కువ రోజులు నీటిలో నానడంతో కర్రలు నేలవాలి కుళ్లిపోయాయి. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా నష్టం జరిగింది. ఎకరాకు 35-40 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తే చాలామందికి పెట్టిన ఖర్చులు కూడా రాలేదు. పెన్నా తీరంలో గ్రామాల్లో రైతులకు కోలుకోలేని గాయమైంది. కూలీలు కూడా తీవ్రంగా నష్టపోయారు. నారు కయ్యలు తయారీ, దుక్కులు, మడి సేద్యం, గట్లు శుభ్రం, ఎరువులు చల్లకం, సస్యరక్షణ మందుల పిచికారి, నీటి తడులు అందించేందుకు చాలామంది అన్నదాతలు కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. వారు రోజూ పంటకు నీరందించి కాపాడాలి. అందకు కూలీ చెల్లించకుండా పంట పండాక ఎకరాకు రెండు బస్తాలు ధాన్యం ఇచ్చేలా మౌఖికంగా ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క శ్రమజీవి 5 నుంచి 20 ఎకరాలను ఒప్పుకొన్నారు. ఈసారి వాతావరణం అనుకూలించింది. తెగుళ్లు, పురుగుల సమస్య తక్కువే. పంట బాగా పెరిగింది. తిండి గింజలకు ఢోకా ఉండదని ధీమాగా ఉన్నారు. రెండు, మూడు వారాల్లోపు పంట చేతికి వస్తుందని ఆశించారు. ఈలోపు వెనుక జలాలు దూసుకొచ్చాయి. రెండు, మూడు రోజుల పాటు ఉంటాయని అనుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో రెండు మాసాలు చేలల్లోనే అలాగే ఉండటంతో కంకులు తడిసిపోయాయి. నీటిలో బాగా నానిపోవడంతో మొలక వచ్చాయి. కర్రలు నీటిలో వాలిపోయి కుళ్లిపోయాయి. కూలీలకు ధాన్యం దక్కలేదు. నాలుగు నెలలకు పైగా కష్టపడ్డారు. ఆరుగాలం శ్రమించినా నిరాశే మిగిలింది. ఈ పల్లెల్లో నీరుకట్టు కూలీలు సుమారు 50 మందికి పైగా నష్టపోయారు. మరోవైపు నూర్పిళ్ల పనులతో తీరిక లేకుండా గడపాల్సిన శ్రమజీవులు ఖాళీగా ఉంటున్నారు. ముంపు సమయంలో ప్రభుత్వం నుంచి నిత్యావసర సరకులను అందుతాయని ఆశిస్తే ఎలాంటి సాయం చేయలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి చేదోడుగా నిలుస్తామని హామీనిచ్చారు. ఎలాంటి మేలు చేయలేదు.
---------------