గోల్ మాల్ (కరీంనగర్)
కరీంనగర్, నవంబర్ 30 పాడి గేదెల కొనుగోలులో నూతన మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా పాత మార్గదర్శకాలనే అమలు చేస్తున్నారు. ఉన్నతాధికారికి తప్పుడు సమాచారమిచ్చి తామనుకున్నట్లు సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4,174 మంది లబ్ధిదారులతో ఆవులు, గేదెలను కొనుగోలు చేయించారు. ఎస్సీ, ఎస్టీలకు 2,492, బీసీ, ఓసీలకు 1,682 అందజేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం రాయితీ కాగా బీసీ, ఓసీలకు 50 శాతం రాయితీ. ఆవు అయినా గేదైనా దాని విలువ రూ.70,074.. కాగా ఇందులో వందకు పైగా గేదెలు, ఆవులు మరణించాయి. వాటికి బీమా ఉండటంతో బీమా కంపెనీ మరణించిన వాటి స్థానంలో మరోదాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా నూతన మార్గదర్శకాలతో గిట్టుబాటు కాదనుకొని పాత పద్ధతికే మొగ్గుచూపారు. పశువైద్యుడు, రైతు వెళ్లి కొనుగోలు చేయడం పాత పద్ధతి కాగా కమిటీ నేతృత్వంలో కొనుగోలు చేయడమనేది నూతన పద్ధతి. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరులో ఆవులు, గేదెలు కలిపి 94 కొనుగోలు చేయగా వీటి విలువ రూ.65,85,996. పాడి గేదెల కొనుగోలులో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ దళారీ పశుసంవర్థక శాఖలోని అధికారికి సన్నిహితుడు కావడంతో ముందుగానే ప్రణాళిక రచించారు. కొనుగోలు చేసే ప్రాంతంలో ముందుగానే విక్రయించే రైతులతో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారు. వాస్తవానికి సదరు ఆవులు, గేదెల విలువ రూ.40-50వేలకు మించి ఉండదన్నది పాడి పరిశ్రమలో అవగాహన ఉన్నవారు చెప్పేమాట. రేణికుంట, తిమ్మాపూర్, వీణవంక, శంకరపట్నం, పర్లపల్లి, జమ్మికుంట, వావిలాల, మొలంగూర్, కొత్తపల్లి, సింగపూర్, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, ఇందుర్తి, మానకొండూర్, చెల్పూరు, వెంకపల్లి ప్రాథమిక పశుకేంద్రాల నుంచి రైతులను పుంగనూరు తీసుకెళ్లారు. అక్కడున్న ఆవులు, గేదెలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ ప్రాంత పశువులపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఉన్నవాటినే కొనుగోలు చేసినట్లు పలువురు రైతులు వివరించారు. విజయ డెయిరీ నుంచి ఇద్దరు, కరీంనగర్ డెయిరీ నుంచి ఒకరు, ఒక పశ ‰వైద్యుడుతో కలిపి ఉమ్మడి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరగాలి. కానీ పాత పద్ధతిలో కొనుగోలు చేయడంపై ఒక డెయిరీ ఎండీ ప్రభుత్వానికి లేఖ రాశారు. నిబంధనలను విస్మరించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రికి కూడా వివరించారు. అక్రమాలకు తావు లేకుండా కమిటీ ఏర్పాటు చేయగా మళ్లీ పాత పద్ధతేంటని, ఇందులో ఎవరి పాత్ర ఎంతనేది ఆరా తీస్తున్నట్లు సమాచారం. పలువురి అధికారుల స్వలాభం కోసమే మన వాతావరణానికి తట్టుకోలేని ఆవులను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. మరణించిన వాటిలో ఆవులు ఎక్కువగా ఉండగా అవన్నీ హెచ్‌ఎఫ్ జాతికి చెందినవే.. సంకరజాతి, జెర్సీ, ముర్రా, గిర్ ఆవులు మన ప్రాంతానికి అనుకూలం.. కానీ కావాలనే వారికున్న అనుబంధంతో మాటల గారడీతో ఇతర రకాలను అంటగడుతున్నారని సమాచారం. దీంతో రైతులు మళ్లీ మళ్లీ కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.