మాపై ఆరోపణలు వద్దు
విజయవాడ నవంబర్ 30
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సందర్శన సమయంలో నిరసనకారులు ఆయన మీద చెప్పులు రాళ్లు విసిరారు. పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నాయకులు పోలీస్ లే దగ్గరుండి చెప్పులు ,రాళ్లు వేయించారని ఆరోపించడం తగదని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేసారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. డీజిపి పైనే ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు? పర్యటనకు అనుమతివ్వకపోతే వాక్ స్వాతంత్య్రం అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని పోలీస్ లపై ఆపాదించడం శోచనీయమని అన్నారు. పదే పదే పోలీస్ లపై ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ప్రజాదరణ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రిపై మేము దాడి చేయిస్తామా అని ప్రశ్నించారు. ప్రధాన కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలని చేస్తే సహించమని హెచ్చరించారు.