అడ్డగోలుగా విశాఖ భూముల విక్రయం
విశాఖపట్టణం,
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణలో పలు ఉల్లంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయివేట్ సంస్థ ఏర్పాటు పేరుతో విశాఖ నగర శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి 2,010లో ఎకరా ఐదు లక్షల రూపాయలకు ప్రభుత్వం నుంచి భూమి పొంది, ఆర్నెల్లు తిరక్కుండానే రెండు కోట్ల రూపాయలకు అమ్ముకొని లబ్ధిపొందినట్లు, ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలిందని సమాచారం. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ట్యాంపరింగ్, దరఖాస్తుల విచారణతోపాటు తమ పరిధికి లోబడే ప్రతి అంశాన్నీ సిట్ బృందం పరిశీలిస్తోంది. విశ్రాంత ఐఎఎస్ అధికారి డాక్టర్ విజరుకుమార్ నేతృత్వంలో విశ్రాంత ఐఎఎస్ అధికారి వై.వి.అనురాధ, విశ్రాంత జిల్లా జడ్జి టి.భాస్కరరావు సమాలోచనలు చేసుకొని అవసరమైన రికార్డులను తెప్పించుకుంటున్నారు. తమ దృష్టికొచ్చిన ఉల్లంఘనలపై ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ప్రయివేటు సంస్థలకు, వ్యక్తులకు చేసిన భూముల, స్థలాల కేటాయింపు రికార్డులను పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించారా? ఉల్లంఘనలు జరిగాయా? ఆశ్రితపక్షపాతం చూపారా? వాస్తవ ధర కంటే తక్కువకు కేటాయించారా? కేటాయింపులో ఎవరిపాత్ర ఎంత ఉంది? అనే వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయివేటు వ్యక్తులకు, సంస్థలకు చేసిన భూ కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా జరిగినట్లు సిట్ దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పట్లో తహశీల్దార్ కార్యాలయం నుంచి సిసిఎల్‌ఎ, ప్రభుత్వం వరకు మధ్యలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలిస్తే అన్ని స్థాయిల్లోనూ ఏదో ఒక ఉల్లంఘన జరిగినట్లు సిట్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. మార్కెట్ ధర కంటే తక్కువకు, ప్రతిపాదిత ధర కంటే చౌకగా స్థలం కేటాయించడం వంటివి సిసిఎల్‌ఎ, ప్రభుత్వ స్థాయిల్లో చోటు చేసుకున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. మార్కెట్ ధర కంటే తక్కువకు ప్రభుత్వం ద్వారా భూమి పొంది ఆర్నెల్లు తిరక్కముందే కోట్ల రూపాయలకు భూమిని అమ్ముకున్న ఉదంతాలు బయటకొస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పొందిన భూమిని ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు అమ్ముకొనే అవకాశం లేనప్పటికీ, క్రయవిక్రయాలు జరుపుకొని రిజిస్ట్రేషన్‌కు అవరోధాల్లేకుండా కొంతమంది ఉన్నతాధికారులు సహకరించినట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏయే స్థాయిల్లో, ఎక్కడెక్కడ ఉల్లంఘనలు జరిగాయన్నది గుర్తించేందుకు సిట్ అధికారులు దృష్టి సారించారు. 1,947 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ సంవత్సరంలో ఏ ధరకు, ఎంత విస్తీర్ణంలో కేటాయించారో తెలుసుకోవడానికి రికార్డులను, అసైన్డ్ భూముల కేటాయింపు రికార్డులను పరిశీలించనున్నట్లు సమాచారం. క్రయవిక్రయాలు జరిగితే ఎలా జరిగాయి? రిజస్ట్రేషన్ ఎలా చేశారు? ఇందుకు ఎవరెవరు సహకారం ఎలా ఉంది? అనే వివరాలపై ఆరా సిట్ తీస్తోంది. వీటిని యథాతథంగా సిట్ నివేదిస్తే, గత ప్రభుత్వాధినేతల, నాడు పనిచేసిన కొందరు ఐఎఎస్ అధికారుల గుట్టురట్టు కానుందని సమాచారం.