సిటీలో భారీగా డిజిటల్ పేమెంట్స్
హైద్రాబాద్,
డిజిటల్ పేమెంట్లను చేపట్టడంలో (అడాప్షన్ ) బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచినట్టు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) సర్వే వెల్లడించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో సిటీలో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు 10శాతం పెరిగినట్టు రేజర్‌పే తెలిపింది. 2019 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య హైదరాబాద్‌లో యూపీఐ లావాదేవీలు ఏకంగా 142 శాతం పెరిగాయని ‘ద ఎరా ఆఫ్ రైజింగ్ ఫిన్ టెక్ ’ నివేదికలో పేర్కొంది. పేమెంట్ సొల్యూషన్లను అందిస్తున్న రేజర్‌పే సిటీలో నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆన్‌లైన్ చెల్లింపుల లావాదేవీల్లో 51 శాతం ఫైనాన్షియల్ సేవలు, ఫుడ్ అండ్ బేవరేజీస్, యుటిలిటీస్ రంగాల్లోనే ఉన్నాయని ప్రకటించింది. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత అత్యధిక డిజిటల్ లావాదేవీలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ అయిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. తర్వాతి ప్లేస్‌లో సికింద్రాబాద్ , ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఉన్నా యి. నగరంలో యూపీఐ విధానంలో జరుగుతున్న లావాదేవీల్లో 59 శాతం వాటా గూగుల్ పేదే. 2019–-20 తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో యూపీఐ లావాదేవీలు 58 శాతం పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. 500 లోపు లావాదేవీలే ఎక్కువ దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులకు ద్వారాలు తెరుచుకున్నాయి. 2014నుంచి డిజిటల్ పేమెంట్లు నిర్వహించే కొన్ని సంస్థలు ఉన్నప్పటికీ 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గంగా డిజిటల్ పేమెంట్లు, డిజిటల్ వ్యా లెట్ల వినియోగం పెరిగింది.మొబైల్ యూజర్లలో చాలావరకు ఆన్ లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్లపై మొగ్గు చూపుతున్నారు. నగదు కొరత ఏర్పడడంతో అంతా డిజిటల్ పేమెంట్స్ వైపు దృష్టి సారించారు. వినియోగదారుల్లో కూడా అవగాహన వచ్చింది. సమయానికి ఏటీఎంలో డబ్బుల్లేకపోవడం, డబ్బులు ఉన్నా సరిపడా చిల్లర లేకపోవడం, ఏటీఎం యూజర్ చార్జీల రూపంలో భారీగా వసూలు చేస్తుండటం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అదనపు ఖర్చుల్లేకుండానే సులభంగా ఆర్థిక లావాదేవీలను చేసుకునే వీలు డిజిటల్ చెల్లింపులతో అందుబాటులోకి రావడంతో ప్రాధాన్యం పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ తరహా లావాదేవీలు జరుగుతున్నా హైదరాబాద్ కేంద్రంగా గతేడాది కాలంగా 10శాతం వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. ఇందులో రూ. 500 లోపు జరిగే లావాదేవీలే ఎక్కువగా ఉంటున్నాయి. యూపీఐ, క్యూ ఆర్ కోడ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి మాద్యమాల్లో చెల్లింపులు జరుపుతున్న వారే ఎక్కువగా ఉన్నారు.సిటీలో సరిపడా చిల్లర లేకపోవడంతో చిన్న చిన్న బిల్లులు కూడా డిజిటల్ పేమెంట్ రూపంలోనే చేస్తున్నారు. దీనికితోడు లిక్విడ్ క్యాష్ లేకున్నా..చేతిలో ఉండే మొబైల్ సాయంతో చెల్లింపులు చేస్తున్నారు. పెరిగిన మొబైల్ వాడకం, తక్కువ ధరకే లభ్యం అవుతున్న ఇంటర్నెట్ సేవల కారణంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా చెల్లింపుల్లో ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు వంటివి వర్తిస్తుండటం కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి దోహదపడుతున్నాయి.నగరంలో డిజిటల్ వ్యాలెట్లు వాడే యూజర్ల సంఖ్య దాదాపు 60లక్షల పైనే ఉంది. ఇందులో సగటున ప్రతిరోజు ఒక్కో యూజర్ ఒక్క పేమెంట్ అయినా బిల్ చెల్లింపులు, రీచార్జ్, టికెట్ బుకింగ్స్ కాకుండా మనీ ట్రాన్స్‌ఫర్ల కోసం వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సిటీలోని ప్రధానమైన మల్టీ ప్లెక్సుల నుంచి సూపర్ మార్కెట్లు, గల్లీల్లో ఉండే చిన్న తరహా కిరాణ దుకాణాలు, టీ, పాన్ స్టాళ్లలోనూ డిజిటల్ పేమెంట్ల రూపంలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కు వగా కనీసం రూ.1 నుంచి రూ.50 వేల వరకు చేసుకునే వీలు ఉండటంతో చిన్న పేమెంట్లన్నీ డిజిటల్ రూపంలోనే చెల్లించేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.