YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

మృత్యుదేవత!

మృత్యుదేవత!

మృత్యుదేవత!
శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. సృష్టికార్య నిర్వహణా భారాన్ని స్వీకరించాడు బ్రహ్మ. తొంభై నాలుగు లక్షల జీవరాసులను సృష్టించాడు. ఆ కాలంలో ప్రాణులకు మరణం లేదు. ఎందుకంటే.. సృష్టించడానికైతే బ్రహ్మ జన్మించాడు కానీ.. మరణకార్య భారాన్ని స్వీకరించడానికి ఎవరూ జన్మించలేదు. ఈ కార్యాన్ని స్వీకరించడానికి దేవగణాలలో ఎవరూ సంసిద్ధంగా లేరు. అందుచేత పుట్టకే కానీ.. చావు లేదు. బ్రహ్మ ప్రాణికోటిని సృష్టిస్తూనే ఉన్నాడు. భూదేవి ఎందరినైనా భరిస్తుందేకానీ, ఒక్క పాపిని కూడా భరించలేదు. మరణం లేని కారణంగా అసురుల దురాగతాలకు అంతులేకుండా పోయింది.
ఇక భరించలేని భూదేవి, బ్రహ్మ దగ్గరకు వచ్చి,‘విధాతా..ఈ భూభారాన్ని సహించలేను కొంతకాలం ఈ సృష్టికార్యాన్ని ఆపుచెయ్యి’ అని అర్దించింది. బ్రహ్మదేవునకు భూదేవి కోరిక సమంజసంగానే తోచింది. కానీ తను సృష్టి ఆపడానికి లేదు. భూభారం ఎలా తగ్గించాలో ఆయనకు తోచలేదు. తన అసమర్థతకు తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపానలజ్వాల సర్వ లోకాలనూ చుట్టుముట్టి బాధిస్తూంటే.. పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి శాంతించమని కోరాడు. బ్రహ్మదేవుడు అతి కష్టంమీద తన క్రోధాన్ని ఉపశమించాడు. అప్పుడు ఆ క్రోధానలము నుంచి ఎర్రని శరీరకాంతితో ఒక స్త్రీ జన్మించింది. బ్రహ్మదేవుడు ఆ స్త్రీని చూసి ‘నీ పేరు మృత్యువు..నీవు ప్రాణికోటిని సంహరించే కార్యాన్ని స్వీకరించు’ అని ఆఙ్ఞాపించాడు.ఆ మాటవిని మృత్యువు ఎంతో విచారించి ‘విథాతా.. ఈ పాప కార్యాన్ని నేను స్వీకరించలేను, నన్ను క్షమించు’ అని తపస్సు చేయడానికి హిమాలయాలకు బయలుదేరింది. బ్రహ్మదేవుడు ఆమె ప్రయత్నాన్ని ఆపి,‘మృత్యుదేవతా... సంహరణకార్యం సృష్టికార్యమంత పవిత్రమైనది. ఈ కార్యమువల్ల నీకు అధర్మము అంటకుండా వరము ఇస్తున్నాను. నీ కన్నీటి బిందువులే రోగాలై జీవులను మరణోన్ముఖులను చేస్తాయి. నీకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములను తోడుగా ఇస్తున్నాను. వీటి సాయంతో మృత్యుకార్యాన్ని నిర్వహించు’ అని ఆమెను సమ్మతింప చేసాడు. మృత్యుదేవత అంగీకరరించింది. ఆనాటి నుంచి పరాజయం ఎరుగని ప్రత్యర్థిలా ‘మరణం’ జీవులను నీడలా వెంటాడుతూ సృష్టి సమతుల్యానికి విథాతకు సహకరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూనే ఉంది

Related Posts