మనోనిబ్బరం
నీరు మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. గాలి తెరలు తెరలుగా వీస్తుంది. మంట గాలి వీస్తున్నవైపు ప్రజ్వరిల్లుతుంది. తెల్లవారుతూనే గూళ్లు విడిచే పక్షులు ఆహార అన్వేషణలో ఎక్కడెక్కడికో పయనమవుతాయి. మనిషి చేతికి అందినది నోటికి అందకపోవచ్చు. సృష్టిని గమనిస్తే ఏదీ సరళరేఖలా తిన్నగా సాగదు.
కొంతమంది నియమబద్ధ జీవితానికి అలవాటుపడతారు. ప్రణాళికలు వేసుకుని వాటికి అనుగుణంగా గడుపుతారు. అది వ్యక్తిగత క్రమశిక్షణ అంటారు. వారు ఏదైనా కాస్త అటుఇటు అయినా తట్టుకోలేరు.
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నదులు, సముద్రాల నీళ్ళు సాధారణంగా తీరాలమధ్య ప్రవహిస్తున్నా, ఎప్పుడో ఒకసారి తీరం దాటతాయి. ప్రకృతిపట్ల అసహనం ప్రదర్శించి, నోరు పారేసుకుంటే ప్రయోజనం ఉండదు. ప్రకృతి గురువు మనకు చెప్పే అతిముఖ్యమైన పాఠం ఏమిటంటే, జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒడుదొడుకులకు సంసిద్ధంగా ఉండాలని. సమస్యలకు బెంబేలుపడిపోకుండా నిబ్బరంగా ఉంటేనే అనుభవంతో రాటుతేలతాం.
చీమ తన చిన్ని స్థాయిలో కష్టాలు ఎదుర్కొంటే, ఏనుగు తన భారీ స్థాయికి తగ్గట్టు బాధలు భరిస్తుంది. సృష్టిలో ఏ జీవీ సుఖవంతమైన జీవితాన్ని మాత్రమే అనుభవించడానికి పుట్టలేదు, పుట్టదు.
ఒకేరకమైన రుచి కొన్నాళ్లకు మొహం మొత్తిస్తుంది. ఒకే రకమైన జీవితం విసుగు కలిగిస్తుంది. జీవితపుస్తకంలోని ప్రతిపుట, కొత్త అనుభూతులు, అనుభవాలతో నిండిపోవాలి. అందులో గెలుపు ఓటములు, కష్ట సుఖాలు పడుగుపేకలై ఉండాలి. పైనోమెట్టు, కిందోమెట్టు ఉంటేనే నిచ్చెనవుతుంది. ఆరోహణ అవరోహణ సాధ్యమవుతాయి. ఎక్కడమే కాదు దిగడమూ ముఖ్యమే. ఇది ప్రతి ఒక్కరం జీవితానికి అన్వయించుకోవలసిన విలువైన అంశం. దీన్ని గ్రహిస్తే జీవించడంలోని మజా అనుభవంలోకి వస్తుంది.
ఎవరైనా కలిస్తే సైనికులు తమ సాహసాలను కళ్లకు కడతారు. అప్పుడు వారి ముఖంలో ప్రతిఫలించే సంతృప్తికి కొలమానం ఉండదు. అలాగే ఒక ఆటగాడు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలా ఆడిగెలిచాడో, మైమరచిపోతూ వివరిస్తాడు.
వాళ్ల జీవితాల్లో అవి అపురూప క్షణాలు. ఉద్యోగం ఏదైనా సరే, ఉద్యోగికీ ఇలాంటి అమూల్య సన్నివేశాలుండాలి.
పెద్దలు పసితనానికి గెలుపును మాత్రమే పరిచయం చేయకుండా, ఓటమిని దాని అనుభవాన్ని ఎరుకపరచాలి. గెలిచిన వాడికన్నా, ఓడిగెలిచినవాడు గొప్పవాడన్న విషయాన్ని విడమరచి వివరించాలి.చిన్న మనసులో వేసే ఈ విత్తు వారి మనసును దృఢతరం చేస్తుంది. మనోస్థైర్యాన్నిస్తుంది. మార్కులు తక్కువొచ్చినప్పుడు, ఎవరైనా కించపరచినప్పుడు వారు ఆత్మన్యూనతతో కుమిలిపోకుండా- పరిణతి కలిగిన మనస్తత్వంతో, నిబ్బరంతో జీవితాలను సస్యశ్యామలం చేసుకుంటారు!