కృష్ణతత్వం... ప్రేమతత్వం... ఆనందతత్వం...
అంతా క్రిష్ణమయం
కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం.. శ్రీకృష్ణుని రూపం నల్లనిది.. మనసు మాత్రం వెన్న పూసలా తెల్లనిది.. దేనికీ భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధించాడు.. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు.అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం.. సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం.. కృష్ఱుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది.. జవసత్వాలు ఉట్టి పడతాయి.. కృష్ణ నామం కర్ణపేయంగా ఉంటుంది..శ్రీకృష్ణుడు, హిందూమతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారము. నందన నామ సంవత్సర దక్షిణాయాన వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు.అందరికి అన్ని తానే అయ్యి...హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాధలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సాంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గొపికల మనసు దొచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. కాని ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవలసినవి మిగిలిపోతూనే ఉంటాయి, ఉన్నాయి.వెన్న ముద్దల దొంగ...ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్జానికి సంకేతంగా చెపుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ, ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.అంతా క్రిష్ణమయం... ఎందుకు మహిళలు కృష్ణ తత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతీదీ సున్నితత్వం, ఆరాధనే దాని తత్త్వం కృష్ణ తత్వం చదివిన వారికి నిజమైన ప్రేమ తత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషముగా మాట్లాడినట్లు మనము చూడము. రుక్మిణి దేవి యొక్క భక్తి ఆరాధనను, సత్యభామ యొక్క గడసరి తనం, శక్తివంతమైన మహిళగా ఆమెపట్ల కూడా అదే సున్నితత్వం కనబరచడం లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే మహిళలు ఎప్పుడు అచలంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వంను ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహా దేవుడు అయినా కూడ ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది.రంగులమయం...నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లనివర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడు.వేణుమాధవుడు...కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళందరు కలిసి వేణువుని అడిగితే ఇలా అందట... ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తనకంటూ ఏమీ లేదు మనసులో ఏ మాలిన్యమూ, ఏ భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి. తాను తానుగా మిగలాలి. తన స్వచ్ఛమైన మనస్సును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుల్ని పరమాత్మ అక్కున చేర్చుకుంటాడు.కృష్ణమేఘం...ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్
తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయుడి తలల మీద తకధిమి తకధిమి నాట్యం చేస్తున్నప్పుడూ, కంసచాణూరాది రాక్షసుల్ని వరుసబెట్టి వధిస్తున్నప్పుడూ, రణక్షేత్రంలో భీతహరిణంలా వణికిపోతున్న అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ...అసలెప్పుడూ కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికీ అధిపతి.మొత్తం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే:
ఆనందతత్వం
ప్రేమతత్వం
స్నేహతత్వం
ప్రకృతితత్వం
నాయకత్వం
నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!