మసకబారిన కంటివెలుగు (నిజామాబాద్)
నిజామాబాద్, డిసెంబర్ 02 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం అభాసుపాలవుతోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది బారులు తీరి కంటి పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాలో గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం కింద కంటి పరీక్షలు పూర్తయి తొమ్మిది నెలలు గడిచిన కంటి అద్దాలు చాలా మందికి అందలేదు. శస్త్ర చికిత్సలు లేక చాలామంది వృద్ధుల చూపు మందగిస్తోంది. 2015 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కంటివెలుగు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 15 బృందాలకు చెందిన నిపుణులైన నేత్ర వైద్యులు, మండల వైద్య సిబ్బంది కలిసి 2019 ఫిబ్రవరి వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. పథకంలో అవసరమైన వారిని కంటి శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. చాలా మందికి అక్కడికక్కడే కంటి అద్దాలు అందజేశారు. మొదట ఈ కార్యక్రమం బాగా జరిగిన తర్వాత పరిస్థితి మారింది. తొమ్మిది నెలలు గడిచినా కంటి అద్దాలు అందడం లేదు. శస్త్ర చికిత్సల ఊసే లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు దవాఖానాలను ఆశ్రయించక తప్పడం లేదు. కంటి అద్దాలు అవసరమైన వారు 34,788మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో వృద్ధులు, యువత, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. చిన్నపాటి సమస్య ఉన్న వారు, దగ్గరి చూపునకు అవసరమైన కంటి అద్దాలు(రీడింగ్)అప్పటికప్పుడు అందజేశారు. దూరపు చూపు అద్దాలు అవసరమైన వారికి అద్దాలు అందజేశారు. జిల్లాలో 1,96,322 మందికి కంటి అద్దాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 1,61,534 మందికి అందజేశారు. ఇంకా 34,788మందికి ఎదురుచూపులు తప్పడంలేదు. కంటి అద్దాలు ప్రభుత్వం అందజేస్తుందని ఆశపడ్డామని.. చేసేదేమి లేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అద్దాలు తెచ్చుకుంటున్నామని పలువురు వాపోతున్నారు. జిల్లాలో శస్త్ర చికిత్సలు అవసరమైన వారిలో వృద్ధులు అధికంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఆపన్నహస్తం అందక చూపు మందగించి ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. జిల్లాలో 29,677 మందికి శస్త్రచికిత్సలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 263మందికి మాత్రమే నిర్వహించారు.