YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సౌర విద్యుత్ బంద్ (కృష్ణాజిల్లా)

సౌర విద్యుత్ బంద్ (కృష్ణాజిల్లా)

సౌర విద్యుత్ బంద్ (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం,: రైతులకు విద్యుత్తు, సహజ వనరుల ఇంధనశాఖలు రాయితీపై అందించే సౌర విద్యుత్తు సదుపాయం నిలిచిపోయింది. వ్యవసాయ విద్యుత్తు సదుపాయం పొందేందుకు అవకాశాలు తక్కువగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. 90శాతం మేర రాయితీతో లభించే ఈ సదుపాయంతో పలు సౌలభ్యాలు ఉండటంతో పెద్దసంఖ్యలో సాగుదారులు ఆసక్తి చూపారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే రైతుల సంఖ్య ఏటా వేల సంఖ్యలో పెరిగిపోతుండగా, ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తు సదుపాయం వందల సంఖ్యలో కూడా ఉండటంలేదు. విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆధారంగా ఇచ్చే ఉచిత విద్యుత్తుపై ఆధారపడి ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు ఒక్క విస్సన్నపేట సబ్‌డివిజన్‌ పరిధిలోనే ప్రభుత్వం 198 మందికి ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పించారు. ఇంకా తమకు అవకాశం ఇవ్వాలని  కోరుతూ విద్యుత్తుశాఖ కార్యాలయంలో 4,270 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య భారీస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆ సంస్థ వ్యవసాయానికి సౌర విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చింది. బహిరంగ మార్కెట్లో 5.కె.వి. వ్యవసాయ విద్యుత్తు మోటారు, ఫలకాల యూనిట్‌ ధర రూ.5.5లక్షల వరకు ఉంది. ఇంత మొత్తం భరించే శక్తి అన్నదాతలకు లేకపోవటంతో విద్యుత్తు సంస్థ, సహజ ఇంధన వనరుల సంస్థతో కలసి 90శాతం రాయితీ ఇచ్చేందుకు సిద్ధపడింది. కేవలం పదిశాతం మొత్తంగా లబ్ధిదారులు రూ.55వేలు చెల్లించి, బోరు సదుపాయం ఏర్పాటు చేసుకుంటే ఆ శాఖ వ్యవసాయానికి అవసరమైన సౌరఫలకాలు, కొత్త మోటారు తదితర సామగ్రిని ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ నిరంతరాయంగా పని చేయించుకునేలా పది సంవత్సరాల పాటు గ్యారంటీ సదుపాయం కల్పించింది. విస్సన్నపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని విస్సన్నపేట, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాల్లో పెద్దసంఖ్యలో చిన్నకారు రైతులు ఈ సదుపాయం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. 521 సౌర యూనిట్లు ఏర్పాటు చేసి, రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఇంకా తమకు ఇదే సదుపాయం కల్పించాలంటూ విస్సన్నపేట సబ్‌డివిజన్‌ పరిధిలోనే సుమారు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాగుదారులు వినియోగించే విద్యుత్తు పెరుగుతుండగా, ఉత్పత్తి సామర్థ్యం ఆ స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపించటలేదు. ఈ దశలో రైతు ఐదు సంవత్సరాలు వినియోగించుకునే విద్యుత్తు ఖరీదును లెక్కించగా, సుమారు రూ.3లక్షల వరకు ఉంటోంది. ఈ మొత్తాన్ని ఒక్కసారిగా సాగు అవసరాలకు ఖర్చు పెట్టి, సౌర సదుపాయం కల్పిస్తే ఇదే మొత్తం విలువైన విద్యుత్తు సంస్థకు మిగిలేందుకు అవకాశం ఉంది. సహజ ఇందన వనరుల సంస్థ మరికొంత రాయితీగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సౌర సదుపాయం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చిన వారు తనవంతు వాటాగా రూ.55 వేలు చెల్లిస్తే విద్యుత్తు సంస్థ ఒక్కొక్క యూనిట్‌కు రూ.2.20 లక్షలు చెల్లించింది. సహజ ఇందన వనరులసంస్థ తనవంతు రాయితీగా రూ.2.75 లక్షలు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని సౌర విద్యుత్తు సంస్థలను విక్రయించే గుత్తేదారు సంస్థలకు చెల్లించగా, వారు నేరుగా రైతుల పొలాల వద్దకే ఫలకాలు, మోటారు తదితరాలను చేర్చి సదుపాయం కల్పించటంతోపాటు, పది సంవత్సరాల పాటు గ్యారంటీ కల్పించారు. సాగుదారులు సౌర విద్యుత్తు సదుపాయంతో కలిగే అదనపు సౌకర్యాలకు ఆకర్షితులయ్యారు. సాధారణ విద్యుత్తు కొన్ని గంటలపాటే సరఫరా అవ్వటం, అది కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సరఫరా చేయటం జరుగుతోంది. సౌర సదుపాయంతో ఈ సమస్య ఉండదు. రోజంతా మోటారును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు సాంకేతిక సమస్యలు, విద్యుత్తు కోతల సమస్య కారణంగా పంటలు ఎండిపోయే అవకాశం ఉండదు. ఏడాది మొత్తం నిరంతర సరఫరా అవకాశం ఉండటంతో ఒక్క పంట పండే భూమిలో కొందరు రెండు పంటలు పండించుకున్నారు. సాధారణ విద్యుత్తు సదుపాయం పొందేందుకు తమ వ్యవసాయ భూమి వరకు అయ్యే స్తంభాలు, తీగలు తదితర సామగ్రికి రైతులే పెద్దమొత్తం చెల్లించాల్సి ఉండగా, సౌరకు ఈ అవస్థలు లేవు.

Related Posts