పార్లమెంట్ లో దిశ ప్రకంపనలు
న్యూఢిల్లీ,
హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యోదంతంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రాజ్యసభలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినంగా ఉండాలని గళమెత్తారు. ఈ అంశంపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీందర్‌కుమార్ మాట్లాడుతూ.. జీరో ఎఫ్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుచేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనబడుతోందని, పరిధితో సంబంధం లేకుండా కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై నేరాలు ఆగడం లేదని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ అంశంపై అన్నాడీఎంకే ఎంపీ విజయ్ సత్యానంద మాట్లాడుతూ... డిసెంబరు 31లోపు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించి, మరణించేంత వరకు వారిని ఉరితీయాలన్నారు.పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకోలేకపోయారని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని ఎంపీ ఎంఏ ఖాన్ కోరారు. ఒకే అంశంపై అనేకసార్లు మాట్లాడటంపై దేశం మొత్తం సిగ్గుపడాలని జయాబచ్చన్ అన్నారు. కుమార్తెలను బయటకు పంపడానికి తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉందని ఏండీఎంకే ఎంపీ వైగో పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. నిందితులకు 15 నుంచి 20 రోజుల్లో శిక్షపడేలా చూడాలని అన్నారు. న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు. దేశంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, కింది కోర్టులను వేసిన శిక్షలను ఉన్నత న్యాయస్థానాలు తగ్గిస్తున్నాయని ఎంపీ బండ ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.