క్రెడిట్ కార్డు రుసుము రద్దు చేసిన ఎల్‌ఐసీ
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) క్రెడిట్ కార్డు లావాదేవీలపై రుసుములను రద్దు చేసినట్లు ప్రకటించింది. పాలసీదారులు తమ పాలసీలకు చెల్లించే రెన్యువల్ ప్రీమియం, ముందస్తు ప్రీమియం, పాలసీపై తీసుకున్న రుణ మొత్తం, వడ్డీ చెల్లించేప్పుడు క్రెడిట్ కార్డులు వాడితే.. ఇక నుంచి దానిపై ఎలాంటి అదనపు రుసుములూ ఉండవు. ఇది డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిందని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి ఆన్‌లైన్‌లోనూ, పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల్లోనూ లావాదేవీలు నిర్వహించే పాలసీదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని పేర్కొంది. మైఎల్‌ఐసీ యాప్‌లో అన్ని రకాల ఆన్‌లైన్ సేవలకూ వీలు కల్పించినట్లు, పాలసీదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది.