ఏపీలో దుబాయ్ డిన్నర్ రాజకీయ ప్రకంపనలు
హైద్రాబాద్, డిసెండర్ 3
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం. దుబాయ్‌లో అంగరంగ వైభోగంగా ఫంక్షన్. 700 మంది గెస్టులు. 15 స్పెషల్ ఫ్లైట్లు. తెలంగాణ, ఏపీతో పాటు జాతీయస్థాయి ప్రముఖ నాయకులే అతిథులు. కళ్లు చెదిరే ఏర్పాట్లు. ఎంపీ అందులోనూ పారిశ్రామికవేత్త. కుమారుడి ఫంక్షన్‌లో ఆ మాత్రం జిగేల్‌మనే ఏర్పాట్లు కామన్ అనుకోవచ్చు. కానీ ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక, రాజకీయ సమీకరణాలకు కూడా వేదికయ్యిందట జంపింగ్ జపాంగ్‌ల లెక్క, ఈ ఫంక్షన్‌లోనే తేలిందట. అదే ఇప్పడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది ఇంతకీ ఎవరెవరు దుబాయ్ ఫ్లైటెక్కారు...? ఎలాంటి సమీకరణాలపై చర్చ జరిగింది? Also Read - చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అచూకీ కనిపెట్టిన నాసా కేవలం ఈ నిశ్చితార్థం కోసమే 25 కోట్ల రూపాయల వరకు సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థానికి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారట. అలాగే జాతీయస్థాయిలో బీజేపీకి చెందిన పలువురు కీలక ఎంపీలు అటెండయ్యారట. దాదాపు 700 మంది గెస్టులు అటెండ్ అయ్యారట. వీరి కోసం 15 ప్రత్యేక విమానాలు బుక్ చేశారట సీఎం రమేష్. అనేక ట్రిప్పులు సైతం నడిపించారట. శని, ఆదివారాలు సెలవుదినం కావడంతో అనేకమంది రాజకీయ నాయకులు హాజరయ్యారట. కుమారుడి పెళ్లిని సీఎం రమేష్ లాంటి బిగ్‌షాట్ ఈ రేంజ్‌లో చేయడం కామనే. అయితే ఈ నిశ్చితార్థం వేడుక రాజకీయాలకు వేదికగా మారిందట. అదే ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో వున్నారని మొన్న సుజనా చౌదరి బాంబు పేల్చడంతో, దుబాయ్ ఎంగేజ్‌మెంట్ వేడుక రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా, దుబాయ్ వేదికగా వలసల రాజకీయానికి శ్రీకారం చుట్టారని వ్యాఖ్యానించారు. దుబాయ్‌లో సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థానికి ఎవరెవరు వెళ్లారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, పలువురు వైసీపీ ఎంపీలతో పాటు, టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు ఆహ్వానాలు అందాయి. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు దుబాయ్‌కు వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీలో 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో దాదాపుగా 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు దుబాయ్‌లో బీజేపీ నేతలతో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అందరికంటే ముందే దుబాయ్ చేరుకున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన గంటా, అతిత్వరలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా తనతో పాటు తీసుకెళ్లే ఛాన్సుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దుబాయ్ ఎంగేజ్‌మెంట్ వేదికగా, అదే వ్యూహంపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారు న్యాయపరంగా చిక్కులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలన్నదానిపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. అతిత్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు ఉండబోతోందని, ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. అటు వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీ పెద్దలతో టచ్‌లో వున్నారని సుజనా చౌదరి బాంబు పేల్చిన నేపథ్యంలో, ఎవరెవరు దుబాయ్ ఫ్లైటెక్కారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది. అలాగే ఇంకొందరు ఎంపీలు సైతం వెళ్లారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లినవారు ఎవరైనా పార్టీ మారే సమీకరణల కోసమే వెళ్లారనడానికి వీల్లేదు. ఎందుకంటే, సీఎం రమేష్‌తో చాలామంది నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే, దుబాయ్ వేదికగా, జంపింగ్ జపాంగ్‌ల స్కెచ్ సాగిందన్న చర్చ మాత్రం బాగా జరుగుతోంది. బేరసారాలు ఆడేందుకు వేడుకను వేదికగా మలచుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి, దుబాయ్ వేడుక, ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో.