గంజాయి సాగు నుంచి ఉద్యానవన పంటల వైపు
విశాఖపట్టణం,
పదేళ్లుగా విశాఖ మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో సంప్రదాయ పంటల కంటే గంజాయి సాగు వైపే అమాయక గిరిజనులు మొగ్గుచూపుతున్న పరిస్థితి నెలకొందనేది ఎవరూ ఔనన్నా కాదన్నా వాస్తవమే. విచ్చలవిడి గంజాయి సాగు, రవాణాతో అన్నెం పున్నెం ఎరుగని గిరిపుత్రులు పోలీసు, ఎక్సైజ్ కేసులకు బలికాగా... దళారులు, స్మగ్లర్లు, వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు రూ.కోట్లు వెనకేసుకున్నారు. అందుకే నిషేధిత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు ఆ స్థానంలో గిరిజనులకు ఉద్యానవనపంట సాగుపై అవగాహన కల్పించాలని కృతనిశ్చయంతో అడుగులు వేసింది. గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం అమలు చేస్తూ వచ్చింది. ఎక్కడికక్కడ పంటలను ధ్వంసం చేస్తూ రవాణాదారులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించింది. మరోవైపు స్వచ్ఛందంగా సాగు విరమించిన గిరిజనులకు లెక్కకు మించిన ప్రోత్సాహకాలు అందిస్తోంది.పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, జీ.కే.వీధి. హుకుంపేట డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాలు గంజాయి సాగుకు కేంద్రాలు మారిపోయాయనే సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా సగటున ఏడాదికి 10వేల ఎకరాల విస్తీర్ణంలో గంజాయి సాగయ్యేది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై పక్కాగా నిషేధం ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు 3వేల ఎకరాలకు తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు.పాడేరు మండలంలోని ఇరడాపల్లి, గొండెలి, బడిమెల, కించూరు, హుకుంపేట మండలంలోని జర్రకొండ, జి.మాడుగుల మండలంలోని బీరం, గెమ్మెలి, వంజరి, వంతాల, గడుతూరు పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలోను గిరిజనులు గంజాయి సాగును పూర్తిగా వదిలిపెట్టారు.గంజాయి సాగుకు పేరొందిన పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ బొడ్డాపుట్టు, సరియాపల్లి. వీసమామిడి గ్రామాల్లోని కొన్ని గిరిజన కుటుంబాలు ఈ ఏడాది నుంచి గంజాయి సాగు వదిలివేశాయి. గతంలో నిషేధిత పంట సాగు చేసిన భూముల్లో ఇప్పుఉ వరి, రాజ్‌మా, చోడి. పసుపు పంటలను సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వరిపంట దిగుబడులు అధికంగా ఉండడంతో ప్రస్తుతం ధాన్యం నూర్పుల పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక రాజ్‌మా పంట సేకరణ దశలో ఉంది. మరికొందదరు పసుపు పంట సాగుకు సన్నద్ధమవుతున్నారు.