హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా
సమ్మె కాలంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. తామంతా ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టి డ్రైవర్లు, కండక్టర్లుగా 52 రోజులు పనిచేశామని అన్నారు. ఇప్పుడు విధుల నుంచి తప్పించడంతో రోడ్డున పడ్డామని వాపోయారు. తమ ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశముందని.. ఆర్టీసీలో ఉద్యోగం లభిస్తుందన్న ఆశతోనే అప్పుడు విధుల్లో చేరామని తెలిపారు. ఆర్టీసీ శాశ్వత కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం.. తమ గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేసి ఆదుకోవాలని కేసీఆర్‌ను కోరారు.