YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

పక్కా మాఫియా (కృష్ణాజిల్లా)

పక్కా మాఫియా (కృష్ణాజిల్లా)

పక్కా మాఫియా (కృష్ణాజిల్లా)
విజయవాడ, డిసెంబర్ 03  జిల్లాలో నూతన విధానం వచ్చిన తర్వాత ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఎత్తులకు పైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక నిలువ కేంద్రం ఉండేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లాలో ఉన్న రేవుల నుంచి అక్కడి నిలువ కేంద్రానికి తరలించి విక్రయాలు జరపాల్సి ఉంది. నిలువ కేంద్రాల వద్ద ధరలను ఇంతకుముందే ప్రకటించారు. టన్ను ఇసుక జిల్లాలో కనిష్ఠంగా రూ.375 ఉంది. భవానీపురం, గన్నవరం నియోజకవర్గం, విద్యాధరపురం నిలువ కేంద్రాల వద్ద మాత్రం టన్ను ఇసుక రూ.825గా నిర్ణయించారు. రవాణా ఛార్జీలు అదనం. జిల్లాలో 14 ఇసుక రేవులకు అనుమతి ఇచ్చారు. ప్రైవేటు భూముల్లో తవ్వకాలకు అనుమతలు ఇచ్చారు. ప్రైవేటు భూముల్లో టన్ను ఇసుక తీసినందుకు రూ.100 చొప్పున రైతుకు చెల్లిస్తారు. ప్రైవేటు భూముల్లో కూడా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి నిలువ కేంద్రాలకు తరలించాల్సి ఉంది.  జిల్లాలో గత ఐదారు నెలలుగా ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం పనులు ప్రారంభమయ్యాయి. ఇసుకకు డిమాండ్‌ పెరిగింది. నూతన విధానం వల్ల ఇసుక ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కొనుగోలు చేయాల్సి ఉంది. నెట్‌ సెంటర్‌కు వెళ్లి వాటిని కొనుగోలు చేసి రశీదు పొందాల్సి ఉంది. ఆయా నిలువ కేంద్రం వద్ద స్టాక్‌ ఉంటేనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మరుసటి రోజు వెళ్లాల్సి ఉంది. ఇలా ఆన్‌లైన్‌లో స్టాక్‌ చూపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముందుగానే కొంతమంది నెట్‌ నిర్వాహకులు నమోదు చేసుకొని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నెట్‌ సెంటర్ల వద్దనే కాదు.. నిలువ కేంద్రాల వద్ద కూడా రశీదులతో బేరాలాడుతున్నారు. కొంత నగదు ఎక్కువ ఇస్తే ఇసుక కూపన్లు అందజేస్తున్నారు. భవానీపురం వద్ద అదే జరుగుతోంది. ఈ విధంగానే ఫిర్యాదులు రావడంతో నందిగామలో ఇద్దరు వ్యక్తులు నరేష్‌, గోపీచంద్‌లు దొరికిపోయారు. వారిని అరెస్టు చేశారు. రొయ్యూరు రేవు అక్రమాలకు నిలయంగా మారింది. ఇక్కడ రాజకీయ పలుకుబడి ఎక్కువగా ఉండడంతో నేరుగా ఇసుకను తరలిస్తున్నారు.  వాహనాలకు తూకం లేదు.. జీపీఎస్‌ ఏర్పాటు చేయలేదు. దీంతో రశీదు కన్నా అధికంగా లోడ్‌ చేసి పంపిస్తున్నారు. దీంతో నిలువ కేంద్రం వద్ద వ్యత్యాసం వస్తోంది. 10 టన్నులు కొనుగోలు చేసిన వ్యక్తికి అదనంగా మరో ఐదు టన్నుల వరకు లోడ్‌ చేస్తున్నారు. ఇసుక లోడింగ్‌ కూడా ముందుగా టిప్పర్లకు, లారీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాక్టర్లకు జాప్యం చేస్తున్నారు. కావాలనే తమకు లోడ్‌ చేయడం లేదని ట్రాక్టర్‌ యజమానులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగరంలో రెండు కేంద్రాలు ఉన్నాయి. విద్యాధరపురం, భవానీపురం కేంద్రాలు. రెండింటివద్ద టన్ను ఇసుక రూ.825కు విక్రయిస్తున్నారు. శనగపాడు, చందర్లపాడు నుంచి ఇక్కడికి రవాణా చేసి విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి టన్నుకు రూ.450 వరకు రవాణా వసూలు చేస్తున్నారు. 20 టన్నులు అయితే రూ.9వేలు దీనికే చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడ నిలువ కేంద్రం ఏర్పాటు చేసే బదులు అక్కడి నుంచి తాము రవాణా చేస్తామని లారీల యజయానులు చెబుతున్నారు. తమకే రవాణా మిగులుతుందని చెబుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి బ్యారేజీ వరకు ఇసుక రేవులు లేవు. కానీ అక్రమ రవాణా అవుతోంది. బ్యారేజీ దిగువన చోడవరం వరకు లేవు. కానీ ఇక్కడి నుంచి వెళుతోంది. నిఘా కరవైంది. తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినా నామమాత్రమేనన్న విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తనిఖీ కేంద్రాల వద్ద పట్టుకున్న దాఖలాలు లేవు. రేవులు, నిలువ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఇసుక రవాణా షరా మామూలే అన్నట్లు తయారైంది.

Related Posts