YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మాటలే.. చేతల్లేవ్.. (నెల్లూరు)

మాటలే.. చేతల్లేవ్.. (నెల్లూరు)

మాటలే.. చేతల్లేవ్.. (నెల్లూరు)
నెల్లూరు, డిసెంబర్ 03 : చెత్తద్వారా సంపద సృష్టిద్దామన్న ప్రజాప్రతినిథుల మాటలన్నీనీటిమీద రాతలుగానే మిగిలాయి. గత ప్రభుత్వం ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమం నిర్వహణ లేమితో కునారిల్లుతోంది. సంపద సృష్టి కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. చెత్త సేకరణకు హరిత రాయబారులను నియమించి హరిత వాహనాలను సైతం ప్రభుత్వ రాయితీపై అందించింది. ఈ వాహనాలు ప్రారంభంలో బాగా నడిచినా చిన్నచిన్న మరమ్మతులకు గురయ్యాయి. వాటిని సరిచేసే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో మూలకు చేరుతున్నాయి.జిల్లాలో మొత్తం 909 పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ఒక ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రం నిర్మించాలనేది గత ప్రభుత్వ లక్ష్యం. 2017-18 సంవత్సరాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గ్రామాల్లో పరిశుభ్రత, స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రారంభించారు. దీని నిర్వహణకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేయించారు. చెత్తను తరలించేందుకు వాహనాలు లేకపోవడం, కొన్ని గ్రామాల్లో హరిత రాయబారుల కొరత వేధించడంతో చెత్తసంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. చాలా గ్రామాల్లో మురుగుకాలువల గట్లపై చెత్తను పారబోస్తున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరింత ఘోరం. రోడ్లపక్కనే చెత్తను పడేస్తున్నారు. రూ. లక్షల వ్యయంతో నిర్మించిన సంపద కేంద్రాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. చీకటి పడితే మందుబాబులు ఇక్కడే సేద తీరుతున్నారు. చాలా గ్రామాల్లో ఈ సంపద కేంద్రాలు జూదరులకు నిలయంగా మారాయి. మరోవైపు ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్తతో దోమలు పెరిగిపోయి ప్రజలంతా జ్వరాల బారిన పడుతున్నారు. దీనిపై స్పందించి పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లోనూ ప్రతి 250 కుటుంబాలకు ఒక హరిత వాహనం చొప్పున ప్రభుత్వం అందించాలని ఏర్పాట్లు చేసింది. దీనికోసం సుమారు రూ. లక్ష విలువజేసే హరిత వాహనాలను సుమారు 50 శాతం రాయితీపై ప్రభుత్వమే అందించి మరీ చెత్త తరలింపు చేపట్టింది. ఇలా కాళ్ల మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు కుటుంబాల ప్రాతిపదికన చూస్తే మొత్తం 57 హరిత వాహనాలు కావాల్సి ఉండగా ప్రభుత్వం 26 మాత్రమే అందజేసింది. ఇచ్చిన వాహనాలకు కూడా బ్యాటరీలు చెడిపోయాయి. ఇలా చిన్నపాటి మరమ్మతులకు గురైన వాహనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఈ విధంగా చెత్తసంపద కేంద్రాలకు చేరాల్సిన చెత్త కాస్త పల్లెల్లో ఇళ్ల మధ్యనే ఉండిపోతోంది. చెత్తను సేకరించే సిబ్బంది కూడా చాలామంది మానేయడంతో పల్లెల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ప్రత్యేకాధికారుల పాలనలో మరింత దారుణంగా మారింది. గతంలో వాహనాలకు ఎదురయ్యే మరమ్మతులను ఆయా గ్రామాల సర్పంచులు దగ్గరుండి చేయించే వారు. నేడు వాటిని పట్టించుకునే వారు లేక రూ. లక్షల విలువజేసే వాహనాలన్నీ తుప్పుపట్టి పాడైపోతున్నాయి. మేజరు పంచాయతీల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. నిర్మించే బాధ్యతను స్థానిక సర్పంచులు మూడోవ్యక్తికి అప్పగించారు. నిర్మాణం పూర్తి చేసిన తరువాత స్థానిక సర్పంచి, కార్యదర్శులదే నిర్వహణ బాధ్యత. సర్పంచుల పదవీకాలం ముగియటంతో చాలా గ్రామాల్లో అధికారులు వీటి నిర్వహణ పట్టించుకోవటం లేదు. గ్రామాల్లో చెత్త సేకరణ జరగటం లేదు. రూ. కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన షెడ్లు పాడైపోతున్నాయి.

Related Posts