YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీకి దారెటు...

వంశీకి దారెటు...

వంశీకి దారెటు...
విజయవాడ, డిసెంబర్ 4,
వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. శాసనసభ్యత్వానికి మాత్రం రాజీనామా ఇంతవరకూ చేయలేదు. ఆయన గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇటు వైసీపీలోనూ చేరలేదు. తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్ లపై వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం చేస్తూ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు టీడీపీ వల్లభనేని వంశీని పెద్దగా పట్టించుకోవడంలేదు. అలాగే వంశీ కూడా మౌనంగానే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వల్లభనేని వంశీ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. వల్లభనేని వంశీ టీడీపీ సభ్యుడిగానే ఉండటంతో ఆయన చేత సభలో ఎక్కువ సేపు కీలక విషయాల్లో మాట్లాడించాలన్నది వైసీపీ వ్యూహంగా ఉంది. సైకిల్ పార్టీ గుర్తుమీద గెలిచిన ఎమ్మెల్యేతోనే చంద్రబాబును విమర్శించడం, వైసీపీ ప్రభుత్వాన్ని పొగడటం చేయించాలన్నది అధికార పార్టీ ఆలోచన. అందుకోసం వల్లభనేని వంశీకి రాజధాని అమరావతి, ఇసుక వంటి అంశాలను అప్పగించారని తెలుస్తోంది.వల్లభనేని వంశీ కూడా తనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందని, తనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ ను కోరనున్నట్లు సమాచారం. సస్పెన్షన్ ఉత్తర్వులతో పాటు పార్టీ తనకు పంపిన షోకాజ్ నోటీస్ కు పంపిన ఆన్సర్ ను సయితం వల్లభనేని వంశీ స్పీకర్ ముందు పెట్టనున్నారు. దీంతో స్పీకర్ వల్లభనేని వంశీకి అసెంబ్లీలో ప్రత్యేక స్థానం కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. టీడీపీకి దూరంగా వల్లభనేని వంశీకి సీటు కేటాయించవచ్చు.అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం సస్పెన్షన్ గురైన సభ్యుడు పార్టీలో లేనట్లు కాదని, తాము విప్ జారీ చేస్తే కట్టుబడి ఉండాల్సిందేనని చెబుతోంది. ఈ మేరకు వంశీ వ్యవహారాన్ని ఇప్పటికే సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఒకవేళ సభలో తమపై విమర్శలు చేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కరణం బలరాం వంటి వారిని వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీ వ్యవహారం ఇటీలవల కాలంలో సద్దుమణిగినా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయితే మరోసారి రచ్చ అయ్యే అవకాశం లేకపోలేదు.

Related Posts