ఇక ఈ బర్త్ ...
కరీంనగర్, డిసెంబర్ 4,
హెల్త్ ప్రొఫైల్ తయారీకి అధికారులు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకేసారి క్యాంపులు పెట్టి టెస్టులు చేయించే బదులు ప్రొఫైల్ తయారీని నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వేర్వేరు ఆన్‌లైన్ పోర్టల్స్‌లో, రకరకాల జబ్బుల బారిన పడినవారి వివరాలున్నాయి. స్వైన్‌ఫ్లూ, డెంగీ బారిన పడిన వారి వివరాల్ని ఈ–బర్త్ పోర్టల్‌లో, హైపర్‌టెన్షన్, డయాబెటీస్ బాధితుల వివరాలను నేషనల్ హెల్త్ మిషన్ పోర్టల్‌లో, టీబీ పేషెంట్స్ వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్ల నుంచి ఆధార్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. సుమారు 1.54 కోట్ల మందికి ‘కంటి వెలుగు’ కింద పరీక్షలు చేశారు. వీరందరి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ల డేటా ఉంది. ఆరోగ్యశ్రీ పేషెంట్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ నమోదవుతూనే ఉన్నాయి. వీటన్నింటిని క్రోడీకరించి ఒకే వేదికపైకి తీసుకొస్తే హెల్త్ ప్రొఫైల్ తయారీ పని సగం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపైనే ఆలోచన చేస్తున్నామని, సమగ్ర కుటుంబ సర్వే వివరాలనూ పరిశీలిస్తున్నామని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.ప్రస్తుతం జనన, మరణ వివరాల్ని ‘ఈ– బర్త్’ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ కేసుల వివరాలనూ ఇందులో ఎంటర్ చేస్తున్నారు. వివరాలు నమోదుకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌కు యూనిక్ లాగిన్ ఐడీలు ఇచ్చారు. ఇదే పోర్టల్‌లో ఇంకొన్ని రకాల వ్యాధులను చేర్చి వివరాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. డయాబెటీస్, హైపర్‌టెన్షన్, ఓరల్ కేన్సర్ల బారిన పడ్డ పేషెంట్ల డేటాను ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 15 లక్షల మంది పేషెంట్ల వివరాలు ఎన్‌సీడీలో ఉన్నాయి. ఈ పేషెంట్లకు యూనిక్ ఐడీలు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఈ 15 లక్షల మంది ‘హెల్త్ ప్రొఫైల్’ తయారైనట్టేనని, వాళ్లకు ఇంకేమన్నా జబ్బులుంటే, వాటిని యాడ్ చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.