లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న అభియోగాలపై 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటుకు సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆమోదానికి రాష్ట్రపతికి పంపింది. దీంతో ఆప్‌లో కలకలం రేగింది.
ఈసీ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ హైకోర్టులో సవాలు చేసింది. అనర్హులుగా ఈసీ సిఫారసు చేసిన ఎమ్మెలేల జాబితా ఇలా ఉంది.
.ఆదర్శ్ శాస్త్రి (ద్వారక నియోజకవర్గం), అల్కా లంబా (చాంద్నీ చౌక్), .సంజీవ్ ఝా (బురారి),.కైలాష్ గెహ్లాట్ (నజఫ్‌గఢ్), విజేంద్ర గార్గ్ (రాజిందర్ నగర్),.ప్రవీణ్ కుమార్ (జాంగ్‌పుర), శరద్ కుమార్ చౌహాన్ (నరేలా), మదన్ లాల్ ఖుఫియా (కస్తూర్బా నగర్), శివ్ చరణ్ గోయల్ (మోతీ నగర్), సరితా సింగ్ (రొహ్‌టాస్ నగర్), నరేష్ యాదవ్ (మెహ్రౌలీ), రాజేష్ గుప్తా (వాజిపుర్),.రాజేష్ రిషి (జనక్‌పురి), అనిల్ కుమార్ బాజ్‌పేయి (గాంధీనగర్), .సోమ్ దత్ (సదర్ బజార్), అవతార్ సింగ్ (కల్కాజి), సుఖ్‌వీర్ సింగ్ దల (ముంద్కా), మనోజ్ కుమార్ (కాండ్లి), నితిన్ త్యాగి (లక్ష్మీనగర్), జర్నైల్ సింగ్ (తిలక్ నగర్ నియోజకవర్గం)
వేటు పడినవారిలో అధికులు కేజ్రీవాల్ సన్నిహితులే
లాభదాయక పదవులను అనుభవిస్తున్న 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని ప్రధాన ఎన్నికల కమిషర్ అచల్ కుమార్ జ్యోతి సిఫారసు చేశారు. దీనికి సంబంధించిన నివేదికను శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. దీంతో ఆప్‌లో సంక్షోభం నెలకొంది. అనర్హత వేటును ఎదుర్కొంటున్నవారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితులు అధికంగా ఉన్నారు. అటువంటివారిలో ఢిల్లీ కేబినెట్ మంత్రి కైలాష్ గెహ్లాట్ చాలా కీలక నేత. అల్కా లాంబా, ఆదర్శ్ శాస్త్రి 2011 నుంచి కేజ్రీవాల్‌కు సన్నిహితంగా ఉన్నారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నాటి నుంచి వీరు కేజ్రీవాల్‌కు కీలక అనుచరులు. లక్ష్మీ నగర్ ఎమ్మెల్యే నితిన్ త్యాగి ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియాకు సన్నిహితుడు, ఈయన పేరు కూడా ఈ జాబితాలో ఉంది.