తోటి జవాన్లను కాల్చిచంపిన ఐటీబీపీ జవాను
రాయ్ పూర్ డిసెంబర్ 4,
ఛత్తీస్ గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత నారాయణ్పూర్ జిల్లాలో ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు(ఐటీబీపీ) దళం లో దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని కడెనార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఐటీబీపీ 45వ బెటాలియన్ జవాన్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెహమాన్ ఖాన్ అనే జవాన్ తన సర్వీసు తుపాకీతో తోటి జవాన్లపైకి కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో రెహమాన్ ఖాన్ సహా మరో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సెలవు దొరకలేదనే కారణంతో తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనపై విచారణకు ఆదేశంచినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. గాయాపడినవారిని హెలికాప్టర్ లో రాయ్ పూర్ కు తరలించారు.